మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ రాస్తున్నాయ‌ని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, ప‌త్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ పీకుతున్నారు. గ‌తంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయ‌ని ప‌త్రిక‌లు ప‌త్రిక‌లే కావ‌ని, ప్ర‌సారం చేయ‌ని మీడియా మీడియానే కాద‌ని గులాబీ ద‌ళం తీర్మానించేసింది. అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నాలు, వెలువ‌రించిన వార్త‌లు పెయిడ్ న్యూస్‌గా క‌నిపించ‌ని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓ ప‌త్రిక క‌థ‌నం రాయ‌గానే దానిని పెయిడ్ న్యూస్ అని ఆయ‌న గొంతు చించుకుని గ‌గ్గోలు పెడుతున్నారు.

అస‌లు విష‌యంలోకి వెళ్తే.. మియా పూర్ భూముల కుంభ కోణం కేసీఆర్ స‌ర్కారుని భూకంపం మాదిరిగా కుదిపేస్తోంది. అనుకూల ప‌త్రిక‌లు దీనిని తొక్కి పెడుతున్నా.. కొన్ని జాతీయ ప‌త్రిక‌లు మాత్రం విష‌యాన్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. మియాపూర్ లో 15 వేల కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని..హైదరాబాద్ లో భూమి టైటిల్స్ అన్నీ గందరగోళంలో ఉన్నాయని..దీని వల్ల అగ్రశ్రేణి సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయని ఎక‌న‌మిక్స్ టైమ్స్ ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని విస్తృతంగా ప్ర‌చురించింది. భూమి టైటిల్స్ గందరగోళంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని ..దీని వల్ల పెట్టుబడులపై ప్రభావం పడుతోందని ప‌త్రిక నిష్టుర స‌త్యం వెల్ల‌డించింది.

దీనిని పాజిటివ్‌గా తీసుకోవాల్సిన మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. మీడియాకు సుద్దులు చెప్పారు. గ‌తంలో వైఎస్ హయాంలో ఏపీఐఐసీ వేలం వేయగా..ల్యాంకో సంస్థ పోటీ బిడ్డింగ్ లో భూములు కొనుగోలు చేసి..ల్యాంకో హిల్స్ చేపట్టగా..ఈ భూమి కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీంతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అధికారంలోకి రాక ముందు టీఆర్ఎస్ కూడా ల్యాంకో హిల్స్ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అదే విష‌యాన్ని టైమ్స్ పేర్కొంటే మంత్రిగారు తీవ్రంగా నొచ్చుకున్నారు. స్వేచ్ఛ గురించి అర‌గంట‌కు పైగా క్లాస్ పీకారు. సొంత ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ లో భారీ ఎత్తున క‌థ‌నాన్ని వండి వార్చారు. అస‌లు ఉన్న విష‌యం చెబితే.. మంత్రిగారికి ఇంత కోపం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నాయి విప‌క్షాలు. మ‌రి వీటికేం స‌మాధానం చెబుతారో చూడాలి.