కోడెల కొడుక్కి, కూతురికి 2 అసెంబ్లీ సీట్లు కావాలా…

ఏపీ రాజ‌కీయాల్లో గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్లో రాణిస్తున్నారు ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కంటిన్యూ అవుతోన్న ఆయ‌న రాజకీయంగా ఎత్తుప‌ల్లాల జీవితాన్ని అనుభ‌వించారు. న‌ర‌సారావుపేట నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ నుంచి పోటీ చేసి మ‌రోసారి విజ‌యం సాధించారు. గ‌తంలో హోం మంత్రిగా కూడా ప‌ని చేసిన కోడెల ప్ర‌స్తుతం స్పీక‌ర్‌గా ఉన్నారు.

ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయ‌న మ‌ధ్య‌లో రెండుసార్లు మాత్రం ఓట‌మి పాల‌య్యారు. ఇదిలా ఉంటే కోడెల వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌న్న విష‌యాన్ని ఆయ‌న ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు కూడా చెప్పేసిన‌ట్టు టాక్‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని కోడెల త‌న కుమారుడు శివ‌రాంతో పాటు కుమార్తె విజ‌య‌ల‌క్ష్మికి రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల‌ని కూడా చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కోడెల చేతిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. న‌ర‌సారావుపేట‌కు కూడా ఆయ‌నే ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దీంతో ఈ రెండు సీట్లు ఆయ‌న చేతిలో ఉన్న‌ట్టే.

ఈ రెండు కాకుండా గుంటూరు వెస్ట్ సీటును కూడా ఆయ‌న లైన్లో పెడుతున్నారు. ఈ మూడు సీట్ల‌లో ఏవైనా రెండు సీట్ల‌ను ఆయ‌న త‌న కుమారుడు, కుమార్తెకు ఇప్పించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ప‌ల్నాడులోనే కొత్త‌గా రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయి. అప్పుడు ఆయ‌న‌కు మ‌రిన్ని ఆప్ష‌న్లు ఉంటాయి.

కోడెల కుమారుడు శివ‌రాం ఇప్పటికే స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌సారావుపేట‌లో తానే వ్య‌వ‌హారాలు న‌డిపిస్తున్నాడు. కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి పొలిటిక‌ల్ ఎంట్రీకి ఉత్సాహంతో ఉన్నారు. ఆమె భ‌ర్త మ‌నోహ‌ర్ గుంటూరు ప‌ట్ట‌ణంలో ప్ర‌ముఖ వైద్యుడిగా ఉన్నారు. ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. మ‌రి కోడెల కోరిక‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారు ? అన్న‌ది చూడాలి.