గుంటూరు జిల్లాలో ఆ సీటు జ‌న‌సేన‌దేనా..?

ఏపీలో జ‌న‌సేన బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెల‌వ‌క‌పోయినా గ‌ణ‌నీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎన్నిక‌ల రంగంలో ఉండ‌డంతో మ‌రోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం జిల్లాలో జ‌న‌సేన ఊపు అంత‌గా లేక‌పోయినా ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తా చాటే ఛాన్సులు ఉన్నాయి. గుంటూరు న‌గ‌రంలోని ఈస్ట్‌, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు ఇక్క‌డ బ‌లంగా ఉన్న కాపు సామాజికవ‌ర్గం ఓట‌ర్లు కూడా ఆ పార్టీకి ప్ల‌స్ కానున్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీకి ఫాలోవ‌ర్లు ఎక్కువ‌గానే ఉన్నా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెల‌వ‌డం అంత వీజీ కాదు.

అయితే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి గుంటూరు రూర‌ల్ కేంద్రంగా కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డితే మాత్రం ఆ సీటును జ‌న‌సేన గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. గుంటూరు రూర‌ల్ మండ‌లంలోనే ఏకంగా 80 వేల వ‌ర‌కు కాపు ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప‌వ‌న్‌కు, జ‌న‌సేన‌కు వీరాభిమానులుగా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే గుంటూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డితే అక్క‌డ నుంచి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు ప‌లువురు ఆశావాహులు ఆస‌క్తితో ఉన్నారు. న‌గ‌రంలో జ‌న‌సేన వ‌ర్గాల్లో కూడా గుంటూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డితే అది జ‌న‌సేన‌కు బ‌లంగా ఉంటుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డితే జ‌న‌సేన నుంచి పోటీ చేసేందుకు టౌన్‌లో ప‌వ‌న్ అభిమాన సంఘాల నాయ‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు సైతం ఆస‌క్తి చూపిస్తున్నారంటే అక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం ఎంత బ‌లంగా ఉంటుందో అంచ‌నాకు రావ‌చ్చు. ప్ర‌స్తుతం ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా అప్ప‌ట‌కీ గుంటూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డి..రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.