కాంగ్రెస్ సభ ఎఫెక్ట్… పెరిగిన జగ్గారెడ్డి ఇమేజ్ 

అంతకుముందు వరకు ఆయనను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా… ఆయన తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర బలంగా ఉండేది. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన జగ్గారెడ్డి… మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ సంగారెడ్డిలో భారీ సభను ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన తరువాత జగ్గారెడ్డి ఇమేజ్ బాగా పెరిగిపోయింది.

ఒకప్పుడు తెలంగాణ ద్రోహి అంటూ కాంగ్రెస్ లోనే ఆయనపై విమర్శలు గుప్పించిన చాలామంది నాయకులు… ఇప్పుడు జగ్గారెడ్డిని అభినందించేందుకు పోటీపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓ బహిరంగ సభ కూడా పెట్టలేని దుస్థితిలో ఉందన్న అపోహలను పటాపంచలు చేసిన జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం చర్చించుకుంటున్నారు. మరికొందరైతే… సంగారెడ్డి సభతో జగ్గారెడ్డి రాహుల్ గాంధీ దృష్టిలో పడిపోయారని… ఇక ఢిల్లీలోనూ రాహుల్ ను నేరుగా కలిసే వీలు జగ్గారెడ్డికి దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తన సొంత సీటు అయిన సంగారెడ్డితో పాటు మరో రెండు సీట్లను తనకు కావాల్సి వారికి ఇప్పించుకునే స్థాయికి జగ్గారెడ్డి చేరుకున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులే చర్చించుకుంటుండటం మరో విశేషం. మొత్తానికి ఒకప్పుడు తెలంగాణలో సమైక్యవాదిగా గుర్తింపు తెచ్చుకున్న టి కాంగ్రెస్ నాయకుల దృష్టిలో విలన్ గా మారిన జగ్గారెడ్డి… ఇప్పుడు వారి దృష్టిలో హీరో అనిపించుకోవడం గొప్ప విషయమే.