జగన్ కి హైకోర్టు మరో ఝలక్

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో మ‌రో షాక్ త‌గిలింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జ‌గ‌న్ గ‌తంలో త‌న‌పై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్‌స్టేష‌న్‌లో న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని హైకోర్టులో క్యాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఈ పిటీష‌న్ ప‌రిశీలించిన హైకోర్టు జ‌గ‌న్‌కు షాక్ ఇస్తూ ఆ పిటీష‌న్‌ను తోసిపుచ్చింది.

దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్ ప్ర‌మాదం జ‌రిగినప్పుడు ఆ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్ అధికారుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. వైద్యులు, కలెక్టర్ విధినిర్వహణను జగన్ అడ్డుకున్నారని పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు.డ్యూటీలో ఉన్న త‌మ‌ను జ‌గ‌న్ ఇష్టానుసారంగా తిట్టార‌ని కూడా అధికారులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసు విషయమై జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కేసును కొట్టి వేయ‌డానికి హైకోర్టు అంగీక‌రించ‌లేదు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తాడో ? నెక్ట్స్ స్టెప్ ఎలా తీసుకుంటాడో చూడాలి.