దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు

తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న‌ది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్క‌డ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భాక‌ర్‌, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఇలా ఎవ‌రికి వారు గ్రూపులుగా వ్య‌హ‌రిస్తుంటే గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా తాను ఓ స‌ప‌రైట్‌గా వ్య‌హ‌రిస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌ల‌కు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపుల‌తో పాతాళానికి ప‌డిపోకుండా ఉంటే అదే ప‌దివేల మేళ్లు.

ఇదిలా ఉంటే టీ బీజేపీలో సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఇప్పుడు పార్టీలో నాయ‌కుల‌కు, క్యాడ‌ర్‌కు పెద్ద త‌ల‌పోటుగా మారింది. కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ వ‌ర్సెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావు మ‌ధ్య ఆధిప‌త్యం కోసం కోల్డ్ వార్ న‌డుస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య వార్‌తో నాయ‌కులు ఎవరితో ఎక్కువగా సన్నిహితంగా ఉండాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

తెలంగాణ‌లోని బీజేపీ నాయ‌కులు వీరిలో ఒకరిని కలిస్తే మరొకరికి కోపం వస్తోందట. దీంతో ద్వితీయ శ్రేణి నాయ‌కులు, మిగిలిన ప్ర‌జాప్ర‌తినిధులు వీరి మ‌ధ్య క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం..విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా న‌లుగుతున్నారు. ద‌త్తాత్రేయ మంత్రిగా జాతీయ స్థాయిలో మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. ఆయ‌న‌కు మోడీతో పాటు అమిత్ షా వ‌ద్ద స‌హ‌జంగానే ప్ర‌యారిటీ ఉంటుంది.

ఇటు ముర‌ళీధ‌ర్‌రావుకు కూడా దత్తాత్రేయ క‌న్నా మంచి ప్ర‌యారిటీనే అమిత్‌, మోడీ ద‌గ్గ‌ర ఉంది. ఆయ‌నంటే అధినాయ‌క‌త్వానికి మంచి గురి. దీంతో తెలంగాణ‌లోని బీజేపీ నాయ‌కులు 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్లు, ప‌ద‌వులు, ఇత‌ర‌త్రా అంశాల కోసం ముర‌ళీధ‌ర్‌రావును క‌లిస్తే ద‌త్తాత్రేయకు కోపం వ‌స్తోంది. తాను మంత్రిగా ఉండ‌గా ముర‌ళీధ‌ర్‌రావును క‌ల‌వ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక ఉత్త‌ర తెలంగాణ జిల్లాలతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద‌త్తాత్రేయ‌తో ఎక్కువ ట‌చ్‌లో ఉండే గ్యాంగ్‌ను ముర‌ళీధ‌ర్‌రావు లైట్ తీస్కొంటున్నార‌ట‌. ఏదేమైనా టీ బీజేపీలో ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ల మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. ఇది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు..!