తెలంగాణ టీడీపీలో మోత్కుప‌ల్లి ఒంట‌రా?!

తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా న‌ల్లగొండ జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఇప్పుడు ఒంట‌రి వాడైపోయార‌ట‌. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయార‌ట‌. నిజానికి ఒక‌ప్పుడు అన్న‌గారి హ‌యాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చ‌క్రం తిప్పిన మోత్కుప‌ల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

తాజాగా తెలంగాణ‌లో గురువారం మ‌హానాడు జ‌రిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్త‌ల్లో లేని మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి టీడీపీ ప‌రిస్థితిపై ముఖ్యంగా 2019లో తెలంగాణలో టీడీపీ ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంపై ఆయ‌న కొన్ని ప్ర‌శ్న‌లు సంధించార‌ట‌. అయితే, ఆ ప్ర‌శ్న‌ల‌కు అటు అధినేత చంద్ర‌బాబు నుంచి కానీ, ఇటు తెలంగాణ‌లో త‌న ప్రభావాన్ని పెంచుకోవాల‌ని చూస్తున్న రేవంత్ రెడ్డి కానీ జ‌వాబు ఇవ్వ‌లేద‌ట‌. దీంతో మ‌హానాడులో తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఎందుకివ్వ‌డం లేదని మోత్కుప‌ల్లి త‌న స‌హ‌చ‌రుల వ‌ద్ద వాపోయిన‌ట్టు తెలిసింది.

అయితే, మోత్కుప‌ల్లి ఆవేద‌న‌ను మ‌రోలా కూడా అర్థం చేసుకోవ‌చ్చు! ఆయ‌న 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో ప‌నిచేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాక్ రికార్డ్ ఆయ‌న‌ది. ఇక‌, రేవంత్ విష‌యానికొస్తే 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న కంటే చాలా జూనియ‌ర్‌. కానీ, ఈ మ‌ధ్య రేవంత్ ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడుతో ఇత‌ర టీడీపీ నేత‌లు వెన‌క‌బ‌డిపోతున్నారు అన‌డంలో సందేహం లేదు.

టీ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అన్న‌ట్టుగా ప‌రిస్థితిని మార్చుకున్నారు. దీంతో ఇత‌ర నేత‌లకు గుర్తింపు ఉండ‌టం లేదు! సో.. ఇప్పుడు మోత్కుప‌ల్లి కూడా ప్ర‌త్యేకంగా చేసేదంటూ ఏమీ లేదు క‌దా! ఆయ‌న పాలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్న‌ప్ప‌టికీ, పార్టీలో మోత్కుప‌ల్లి ప్రాధాన్య‌త ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. కాబ‌ట్టి, ఆయ‌న అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు నుంచి సమాధానం వస్తుంద‌ని ఆశించ‌లేం. సో.. ఇప్పుడు మోత్కుప‌ల్లి ఎవ‌రికీ చెంద‌ని వ్య‌క్తిగా ఉన్నారా? అని పిస్తోంది. మ‌రోప‌క్క ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్న గ‌వ‌ర్న‌ర్ గిరీపై నేటికీ స్ప‌ష్టత రాలేదు. దీంతో మోత్కుప‌ల్లి తీవ్ర ఆవేద‌న‌గా ఉన్నార‌ట‌.