క‌ర‌ణం – గొట్టిపాటి ఎవ‌రు టీడీపీకి బై చెపుతారు..!

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో టీడీపీ బ‌లోపేతం అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఆక‌ర్ష్‌తో టీడీపీలో చేరిన చాలామంది అక్క‌డ పాత‌వారితో వేగ‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కు జంపింగ్ జపాంగ్‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వివాదాలు మాత్ర‌మే ఉంటే ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో ఏకంగా హ‌త్య‌లు చేసుకునే వ‌ర‌కు వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.

గొట్టిపాటి పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి తీవ్రంగా విబేధిస్తోన్న బ‌ల‌రాం తాజాగా ప్ర‌కాశం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక సంద‌ర్భంగా ఒంగోలు జిల్లా పార్టీ కార్యాల‌యంలో మంత్రుల స‌మక్షంలోనే గొట్టిపాటితో ఫైటింగ్‌కు దిగారు. చివ‌ర‌కు ఇరు వ‌ర్గాలు కొట్టుకోవ‌డంతో పాటు గొట్టిపాటి చొక్కా చిరిగే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. అస‌లు గొట్టిపాటిపై క‌ర‌ణం ఈ రేంజ్లో ఫైరింగ్ వెన‌క బ‌ల‌మైన కార‌ణ‌మే క‌నిపిస్తోంది.

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి అంద‌రిని క‌లుపుకుపోతున్నాడు. బ‌ల‌రాం వ‌ర్గం అక్క‌డ రోజు రోజుకు గొట్టిపాటికి ద‌గ్గ‌ర‌వుతోంది. దీంతో రాజ‌కీయంగా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌ర‌ణం ప్రాబ‌ల్యం రోజు రోజుకు కుంచించుకుపోతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న జ‌రిగితే త‌ప్ప అద్దంకిలో క‌ర‌ణం గెలిచే ప‌రిస్థితులు లేవ‌ని అక్క‌డ రాజ‌కీయ‌వ‌ర్గాల అంచ‌నా. దీంతో త‌న ప్రాబ‌ల్యాన్ని చాటుకునేందుకు క‌ర‌ణం గొట్టిపాటితో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక తాజా గొడ‌వ త‌ర్వాత గొట్టిపాటి చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో తిరిగి వైసీపీలోకి వెళ్ల‌డమే బెట‌ర్ అని వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. పైగా స‌మావేశం నుంచి తిరిగి వెళ్లేట‌ప్పుడు గొట్టిపాటితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్ద‌లూరు ఎమ్మెల్యే ముత్త‌ముల అశోక్‌రెడ్డి ముగ్గురూ ఒకే కారులో వెళ్లిపోయారు.

ఇక క‌ర‌ణం బ‌ల‌రాంకు చంద్ర‌బాబు ఎన్నోసార్లు చెప్పి చూసినా ఆయ‌న ప‌రిస్థితిలో మార్పురాలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి సీటు త‌న‌కు రాద‌ని డిసైడ్ అయిన క‌ర‌ణం గొట్టిపాటితో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే క‌ర‌ణం వైసీపీలోకి జంప్ చేసి అయినా గొట్టిపాటిని ఢీ కొట్టాల‌న్న క‌సితో ఉన్నార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు టీడీపీలో ఉంటారు ? ఎవ‌రు పార్టీకి బై చెపుతారు ? లేదా ఒకే ఒర‌లో ఇమ‌డ‌ని క‌త్తుల్లా ఎన్ని రోజులు క‌ల‌హించుకుంటారు ? చంద్ర‌బాబు వీరి పంచాయితీని ఎలా ప‌రిష్క‌రిస్తారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.