బాహుబ‌లిని ఎందుకు టార్గెట్ చేశారంటే..

బాహుబ‌లి-2 సినిమా కోసం ఒక క‌లెక్ట‌ర్ ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేశారు. కొంత‌మంది త‌మ రాజ‌కీయ ప‌లుకుబ‌డినంతా ఉప‌యోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాట‌ప‌డ్డారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్‌`లు సాహో అంటుంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమలో మాత్రం `వ‌ద్దు బాహుబ‌లిని చూడొద్దు` అంటూ.. అక్క‌డి ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నారు. క‌న్న‌డ చిత్రాల‌నే ఆద‌రించాల‌ని ప‌ర‌భాషా చిత్రాల‌ను ఆద‌రించొద్ద‌ని చెబుతున్నారు. వీరి బాధంతా ఎందుకు అని ఆశ్చ‌ర్య‌పోకండి..!! ఈ ద‌ర్శ‌కులు ఎందుకు బాహుబ‌లిని టార్గెట్ చేశారు? అనుకొంటున్నారా?

క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో. కావేరీ జ‌లాల వివాదంలో న‌టుడు స‌త్య‌రాజ్ త‌ల‌దూర్చ‌డం వ‌ల్ల‌.. అప్ప‌ట్లో బాహుబ‌లి విడుద‌ల‌కు ఆటంకం ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. స‌త్య‌రాజ్ ముందుకొచ్చి సారీ చెప్ప‌డం వ‌ల్ల ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. మ‌రి ఇప్పుడేంటి? అనుకోకండి! విడుద‌లైన అన్ని చోట్ల బాహుబ‌లి-2 రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే చాలు..మిగిలిన సినిమాలు విడుద‌ల చేయ‌డానికి భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. మ‌రి ఎంతైనా ప‌రాయి భాష సినిమా విడుద‌లై.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంటే అక్క‌డి ద‌ర్శ‌కుల‌కు కూడా కొంత ఈర్ష్య‌గా ఉంటుంది క‌దా!!

ఇదే పరిస్థితి క‌న్న‌డ ద‌ర్శ‌కుల‌కు ఎదురైంది.  క‌న్న‌డ సీమ‌లో బాహుబ‌లి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకొంటుంది. ఏ థియేట‌ర్ చూసినా బాహుబ‌లే క‌నిపిస్తోంది. ఇది క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని కొంత‌మంది పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. బాహుబ‌లి వ‌ల్ల క‌న్న‌డ సినిమాల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని, చాలా సినిమాలు బాహుబ‌లికి భ‌య‌ప‌డి విడుద‌ల‌కు నోచుకోలేక‌పోయాయ‌ని క‌న్న‌డ ద‌ర్శ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. `మ‌న సినిమాని మ‌నం ప్రోత్స‌హించుకోవాలి గానీ, బ‌య‌టి సినిమాల కోసం మ‌న సినిమాల‌కు న‌ష్టం జ‌రిగితే ఊరుకొంటామా` అంటూ ప్రాంతీయ వాదాన్ని లాక్కొస్తున్నారు.

వీరి బాధ‌లు ఎలా ఉన్నా ప్రేక్ష‌కులు మాత్రం ప‌ట్టించుకొనే స్థితి క‌నిపించ‌డం లేదు. ఈ వార‌మంతా అక్క‌డ బాహుబ‌లి హంగామా కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని క‌న్న‌డ సినీ వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి. అదీ మ‌న బాహుబ‌లి మ్యానియా!!