బాల‌కృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాల‌కే ప‌రిమిత‌మా?

సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇక రాజ‌కీయాల‌ను లైట్ తీసుకున్నారా?  సినిమాలే బెట‌ర్ అని భావిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు తాగునీటికి ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. వివిధ ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్క‌డ అంటూ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కానీ బాల‌య్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా బాల‌య్య ఎందుకు హిందూపురం రావ‌డంలేదు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియ‌దు క‌నుక సినిమాలే బెట‌ర్ అని ఫిక్స్ అయ్యాడ‌ట‌.

త్వరలోనే నంద‌మూరి బాల‌కృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెబుతారేమోన‌నే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు విశ్లేష‌కులు.  అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ.. ఈ మధ్య తన సెగ్మెంటును పట్టించుకోవడమే మానేశాడు. నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ కాలం పాటు తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణికి కేటాయించిన  ఆయ‌న‌.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో ఇంకో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

తొలినాళ్ల‌లో నియోజక‌వ‌ర్గంపై పూర్తిగా దృష్టిసారించిన బాల‌య్య‌.. త‌ర్వాత వందో సినిమాపై పూర్తిగా దృష్టిపెట్టాడు. నాయ‌కుల‌తోనూ ఆయ‌న మాట్లాడ‌టం లేదు. ప్ర‌స్తుతం హిందూపురం ప్ర‌జ‌లు తీవ్ర నీటి ఎద్ద‌డి ఎదుర్కొంటున్నారు. దాహార్తితో అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు, హిందూ పురం ప్రజలు బాలయ్య తీరుపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. ఆయ‌న‌ కనిపించడం లేదంటూ జనాలు గగ్గోలు పెడుతున్నా.. బాలయ్య మాట మాత్రం కూడా స్పందించడం లేదు. కనీసం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ లీడర్లను కూడా.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపించడం లేదు.

దీంతో.. ఇకపై బాలయ్య పూర్తి స్థాయిలో సినిమాలకే టైమ్ కేటాయిస్తారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. అందుకే.. ఆఖరికి దున్నపోతుపై బాలకృష్ణ అని పేరు రాసినా కూడా ఆయన పట్టించుకోవడం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని అర్థమవడంతోనే బాలయ్య ఇలా చేస్తున్నాడని.. అందుకే సినిమాల వైపే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టున్నాడనీ ఓపెన్ గా జనం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ‌రి త‌న స‌హ‌చ‌రుడు చిరంజీవి బాట‌లోనే బాల‌య్య కూడా న‌డుస్తాడేమో వేచిచూడాల్సిందే!!