తుమ్మ‌ల‌పై కేసీఆర్ కోపానికి అర్థాలే వేర‌యా..!

రైతుల మీద వ‌రాల జ‌ల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు దిగారు! మ‌ద్దతు ప్ర‌క‌టించి అన్నీ ఉచితంగా ఇస్తామ‌ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టిస్తే.. పంట‌ను మంటల్లో వేశారు!! తెలంగాణ‌లో రైతులంద‌రిపైనా సీఎం కేసీఆర్‌.. వ‌ద్దంటే వ‌రాలు కురిస్తున్నారు. కానీ ఆయ‌న‌కు స‌న్నిహితుడు, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇలాకా అయిన ఖ‌మ్మంలో.. మిర్చి రైతులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం.. స‌ర్కార్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్‌.. మ‌రోలా వ్య‌క్తంచేశారు. తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించి.. అందులో త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రోడ్ల అంశంపై మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామ‌నీ, ర‌హ‌దారుల‌ను అందంగా తీర్చి దిద్దుదాం అనుకుంటే ఇంకా గుంత‌లు క‌నిపిస్తూనే ఉన్నాయంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జూన్ 1 నుంచి తాను ప‌ర్య‌ట‌న చేస్తాన‌నీ, రోడ్ల‌పై ఎక్క‌డ గుంత‌లు క‌నిపించినా స‌హించేది లేద‌ని ఆగ్రహించారు. కేంద్రాన్ని ఒప్పించి మ‌రీ జాతీయ ర‌హ‌దారుల‌కు నిధులు సాధించుకున్నా ఇంత నిర్ల‌క్ష్య‌మేంటీ అంటూ ఆ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

రోడ్లు భ‌వ‌నాల శాఖ‌పై కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారంటే.. ఆ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వర‌రావుపై చేసిన‌ట్టే క‌దా! ఖ‌మ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆగ్ర‌హించిన ఘ‌ట‌న తెలిసిందే. గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌న్న బాధ‌లో కొంత‌మంది రైతులు మిర్చియార్డుపై దాడి చేశారు. అది తుమ్మ‌ల ఇలాఖా కాబ‌ట్టి, ప‌రిస్థితిని ముందుగా ఆయ‌న అంచ‌నా వేయ‌లేక‌పోయార‌న్న అసంతృప్తి కేసీఆర్ లో ఉంటుంది. దాన్ని గుర్తించారు కాబ‌ట్టే… న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగారు తుమ్మ‌ల‌. దాడికి దిగింది రైతులు కాద‌నీ, రౌడీల‌నీ, రైతులైతే వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని కూడా ఏదోలా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ప‌రిణామం కేసీఆర్ కి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే క్రియేట్ చేసిందన‌డంలో సందేహం లేదు. రైతుల స‌మ‌స్య‌ల్నే ప్ర‌ధానాంశంగా చేసుకుని కాంగ్రెస్ బ‌ల‌ప‌డే ప్ర‌య‌త్నంలో ఉంది. సో.. దాన్ని దెబ్బ‌తీయ‌డం కోసం బ‌డ్జెట్ లోగానీ, ఆ త‌రువాత ఉచిత ఎరువులంటూ వ‌రాలు గానీ ఇచ్చారు. స‌రిగ్గా, ఇలాంటి త‌రుణంలో స్థానికంగా ఇంత జ‌రుగుతూ ఉంటే తుమ్మ‌ల గుర్తించ‌లేక‌పోయార‌నేది తెరాస వ‌ర్గాల అసంతృప్తి అన‌డంలో సందేహం లేదు. దానిపై నేరుగా స్పందించ‌డం, తుమ్మ‌లను పిలిచి క్లాస్ తీసుకోవ‌డం అనేది సాధ్యం అయి ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే, స‌మీక్ష స‌మావేశంలో తుమ్మ‌ల‌పై ఉన్న ఆ కోపాన్ని ఇలా బ‌య‌ట‌పెట్టార‌నే అభిప్రాయం కొన్ని వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.