ఎవ‌రికి టిక్కెట్టు ఇవ్వాల‌న్నా బాబుకు క‌త్తిమీద సాములాంటిదే..!

ఏపీలో కొత్త‌గా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాలు 225కు పెర‌గ‌నున్నాయి. ఓ వైపు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు, ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల‌తో ఏపీలో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం అప్పుడే హీటెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే కొత్త‌గా ఎక్క‌డ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి ..? ఎవ‌రెవ‌రు రేసులో ఉన్నార‌న్న వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ఏర్ప‌డే కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై అధికార టీడీపీలోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు క‌న్నేసిన‌ట్టు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

అమ‌రావ‌తి కేంద్రంగా గుంటూరు జిల్లాలో కొత్త అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రానుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్లు న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు త‌న‌యుడు య‌ర‌ప‌తినేని మ‌హేష్ అప్పుడే త‌మ వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాయ‌పాటి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాడ‌ని, ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న వార‌సుడికి ఎమ్మెల్యే టిక్కెట్టును అడుగుతార‌ని టాక్‌? ఇక య‌ర‌ప‌తినేనికి మొన్న మంత్రి ప‌ద‌వి మిస్ అయ్యింది. ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌యుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డం పెద్ద క‌ష్టం కాదు.

అయితే ఈ ఇద్ద‌రు వార‌సులు అమ‌రావ‌తి సీటు మీదే క‌న్నేశార‌ని వ‌స్తోన్న వార్త‌లు మాత్రం హాట్ హాట్‌గా మారాయి. మ‌రి వీరిలో చంద్ర‌బాబు కీల‌క‌మైన అమ‌రావ‌తి అసెంబ్లీ సీటును ఎవ‌రికి ఇస్తారన్న‌ది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. మ‌రోవైపు రాయ‌పాటి త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. అటు య‌ర‌ప‌తినేనిని, ఇటు రాయ‌పాటిని స‌మ‌న్వ‌యం చేసుకుని వారి వార‌సుల్లో ఎవ‌రికి టిక్కెట్టు ఇవ్వాల‌న్నా బాబుకు క‌త్తిమీద సాములాంటిదే..!