రాష్ట్రప‌తి ఎంపిక‌లో వాజ్‌పేయ్ మార్క్ వ్యూహం

బీజేపీలో ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యానికి తిరుగుండ‌దనే విష‌యం తెలిసిందే!! ఆయ‌న నిర్ణ‌యానికి ఎదురు చెప్పే ప్ర‌య‌త్నం కూడా చేయ‌రు! పార్టీలో కాబట్టి ఇలా మేనేజ్ చేసేస్తున్నారు. మ‌రి మిత్ర‌ప‌క్షాలు కూడా ఆయ‌న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటార‌న్న అభిప్రాయం లేదు! కానీ వాళ్లు కూడా త‌న‌మాటే వినేలా, త‌న మాట‌కు ఎదురు చెప్ప‌కుండా ఉండేలా.. త‌న నిర్ణయ‌మే ఫైన‌ల్ అయ్యేలా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎంపిక‌లో నాడు వాజ్‌పాయ్ అనుస‌రించిన‌ వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు మోదీ! ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి ఎంపిక‌పై ఆయ‌న ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ప‌లువురి పేర్ల ప‌రిశీల‌న అనంత‌రం ఒక మ‌హిళను ఎంపిక చేశార‌ట.

రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌టంతో కొత్తగా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, ఎల్‌కే అడ్వాణీ, సుష్మాస్వ‌రాజ్‌.. ఇలా ప్ర‌ముఖ‌ల పేర్లు చాలానే వినిపించాయి. జాతీయ మీడియాలో ఒక వార్త ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది. రాష్ట్రప‌తిగా ఒక గిరిజ‌న మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చే ఉద్దేశంలో మోడీ ఉన్నారంటూ నేష‌న‌ల్ మీడియాలో కొన్ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆమె జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము. ఈమె ఒడిషాకు చెందిన మ‌హిళ‌. 2015లో ఆమెని జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించారు. ఇంత‌కీ, ఈమెని తెర‌మీద‌కి తేవ‌డం వెన‌క మోడీ వ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. రాష్ట్రప‌తిని ఎన్నుకోవ‌డం అనేది మోడీ ఒక్క‌రి చేతిలోనే ఉన్న విష‌యం కాదు.

రాష్ట్రప‌తిగా ఒక అభ్య‌ర్థిని మోడీ ఖ‌రారు చేసినా.. ప్ర‌తిప‌క్షాల‌న్నీ కలిసి ఇంకో అభ్య‌ర్థిని పోటీకి తెచ్చే ఛాన్స్ ఉండ‌నే ఉంది. ఇక‌, మిత్ర‌ప‌క్షాలు కూడా కొన్ని పేర్ల‌ను ప‌రిశీల‌న‌కు పెడ‌తాయి. వారి అభిప్రాయాలూ వినాలి. పోటీ జ‌రిగితే మోడీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థికి త‌క్కువ ఓట్లు ప‌డే ఛాన్స్ ఉంది. అలా కాకుండా, అంద‌రూ ఏక‌గ్రీవంగా కాద‌న‌లేని పేరును తెర‌మీదికి తెస్తే… అంతిమంగా మోడీ నిర్ణ‌య‌మే నెగ్గిన‌ట్టు అవుతుంది క‌దా! అందుకే, గిరిజ‌న మ‌హిళ ద్రౌప‌ది పేరును తెర‌మీదికి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆమెను అభ్య‌ర్థిగా నిర్ణ‌యిస్తే అటు శివ‌సేన‌, అకాళీద‌ళ్ వంటి పార్టీలు కూడా అడ్డు చెప్ప‌లేని ప‌రిస్థితి వ‌స్తుంది.

గ‌తంలో వాజ్‌పేయి అనుస‌రించిన వ్యూహాన్నే ఇప్పుడు మోడీ ఫాలో అవుతున్న‌ట్టు! నాడు రాష్ట్రప‌తిగా అబ్దుల్ క‌లామ్ ను ఆయ‌న ప్ర‌తిపాదించేస‌రికి… మిగ‌తా వారంతా సైలెంట్ అయిపోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మోడీ కూడా అదే బాట‌లో ఉన్నారు. ఏదేమైనా, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే కచ్చితంగా మెచ్చుకోదగ్గ పరిణామమే క‌దా!!