అందుకే ఫంక్ష‌న్‌ల‌కు ఎన్టీఆర్‌ను పిల‌వ‌డం లేద‌ట‌..

నారా-నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య దూరం త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో నిర్వహించిన పొలిట్ బ్యూరో స‌మావేశానికి నంద‌మూరి హ‌రికృష్ణ హాజరై.. బావ‌తో పాటు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో విభేదాలు త‌గ్గాయ‌ని అంతా భావించారు. కానీ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్.. మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ హాజ‌రైనా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాకపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు చంద్ర‌బాబు కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కూడా ఎన్టీఆర్ రాక‌పోవ‌డంతో కావాల‌నే దూరం పెడుతున్నారా అనే ప్రశ్న అంద‌రిలోనూ మొదలైంది.

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్.. మంత్రి ప‌ద‌వి ప్ర‌మాణ స్వీకారం అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఇందులో హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.. అన్నీ తానై చూసుకున్నారు. ముఖ్యంగా నంద‌మూరి కుటుంబానికి ప్ర‌త్యేకంగా ఒక గ్యాల‌రీ ఏర్పాటుచేయ‌డంతో.. అంద‌రినీ ద‌గ్గ‌రుండి ప‌ల‌క‌రిస్తూ అక్క‌డ‌క్క‌డే తిరిగారు. క‌ల్యాణ్ రామ్‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. అయితే నాన్న‌, అన్న వ‌చ్చినా ఎన్టీఆర్ ఎందుకు రాలేద‌నే ప్ర‌శ్న అందరిలోనూ ఉంది. అయితే అంద‌రికీ ఆహ్వానం పంపినా.. జూనియ‌ర్‌కు మాత్రం ఆహ్వానం అంద‌క‌పోవ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ట‌.

అలాగే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌లో నూత‌న గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ మిన‌హా మిగిలిన కుటుంబ స‌భ్యులంద‌రికీ పిలుపులు అందాయ‌ట‌. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమానులు మండిప‌డుతున్నారు. కానీ ఆహ్వానం పంప‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను స‌న్నిహితుల వ‌ద్ద బాబు చెప్పార‌ట అదేంటంటే.. గ‌తంలో జ‌రిగిన కొన్ని వేడుక‌ల‌కు ఆహ్వానం పంపించామ‌ని, కానీ అందుకు జూనియ‌ర్ హాజ‌రు కాలేద‌ని, అందుకే ఈసారి పిల‌వ‌లేద‌ని వివ‌రించారట‌.

మొత్తానికి నారా-నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ప‌ట్టింపులు చూసి అభిమానులు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా వీరి మ‌ధ్య విభేదాలు స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్నారు.