నాగ‌బాబుకు జ‌న‌సేన ఎంపీ టిక్కెట్టు..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మ‌రో బ్ర‌ద‌ర్ తోడు కానున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెండో సోద‌రుడు నాగ‌బాబు జ‌న‌సేన‌లో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ పేరు చెపితేనే నాగ‌బాబు మండిప‌డేవాడు. మెగా హీరోల ఫంక్ష‌న్ల‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే అరుపులు, కేక‌ల‌పై నాగ‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌ను తాము ప్ర‌తి ఫంక్ష‌న్‌కు పిలుస్తామ‌ని…ప‌వ‌న్ త‌మ ఫంక్ష‌న్ల‌కు ఎందుకు రావడం లేదో మీరే వెళ్లి అడ‌గాల‌ని కూడా నాగ‌బాబు ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై సీరియ‌స్ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఫ్యాన్స్ నాగ‌బాబును బాగా టార్గెట్ చేశారు. వ‌రుణ్ సినిమాలు చూడ‌మ‌ని కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ హుకూం జారీ చేశారు. త‌ర్వాత నాగబాబు ప‌వ‌న్ అంటే త‌మ‌కు ఇష్ట‌మే అని క‌వ‌ర్ చేసుకోవ‌డంతో ప‌రిస్థితి కూల్ అయ్యింది.

ఇక ఇటీవ‌లే నాగ‌బాబు తాను అవ‌స‌ర‌మైతే జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. తాను గ‌తంలో అన్న చిరు ప్ర‌జారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీకి సేవ‌లు చేశాన‌ని..ఇప్పుడు త‌మ్ముడుకు సాయం చేయాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో ఇక్క‌డ చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో ఆ పార్టీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు సాధించింది. ఇక్క‌డ కాపు వ‌ర్గం ఓట్లు చాలా ఎక్కువుగా ఉన్నాయి. ఇక్క‌డ నాగ‌బాబు బ‌రిలో ఉంటే ఆ ఎఫెక్ట్ ఈస్ట్‌, వెస్ట్ గోదావ‌రిపై గ‌ట్టిగా ఉంటుంద‌న్న న‌మ్మ‌కంతో జ‌న‌సేన వ‌ర్గాలు, ప‌వ‌న్ ఫ్యాన్స్ నాగ‌బాబును ఇక్క‌డి నుంచే ఎంపీగా పోటీ చేయించాల‌ని ప‌వ‌న్‌పై ఒత్తిడి చేస్తున్నార‌ట‌.