సుజ‌నా కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి గండం

ఎన్నో కీల‌క నిర్ణ‌యాల‌తో, ప‌థ‌కాల‌తో, వరుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ప్ర‌ధాని మోదీ.. మ‌రో కీల‌క నిర్ణ‌యానికి జూలైలో శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒకే ఒక్క‌సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రోసారి కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టబోతున్నారు. దీంతో కొంత‌మంది కేంద్ర మంత్రుల్లో ఇప్ప‌టికే గుబులు మొద‌లైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ, ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి ఈ విష‌యంలో మ‌రింత కంగారు ప‌డుతున్నార‌ట‌. గ‌తంలో ఒకసారి విస్త‌ర‌ణ జ‌రిగినా.. త‌న ప‌ద‌విని కాపాడుకున్న ఆయ‌న‌కు ఈ సారి మాత్రం అన్ని అవ‌కాశాలూ మూసుకుపోయాయ‌నే చ‌ర్చ ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.

రెండేళ్లలో ఎన్నికలు రానుండడంతో ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. కీలక చర్యలకు సిద్ధమవుతోంది. జూలైలో కేంద్ర కేబినెట్ ను విస్తరించేందుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సమర్థులకు అవకాశాలిచ్చి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు మోదీ, అమిత్ షా ద్వయం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేశారని కూడా తెలుస్తోంది. కేంద్ర‌మంత్రిగా ఢిల్లీ రాజ‌కీయాల్లో ఏపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్న సుజ‌నా చౌద‌రిపేరు ఢిల్లీ నుంచి అమరావతి వరకూ బలంగా విపరీతంగా వినిపిస్తోంది.

బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినట్టు సుజ‌నాపై విపరీతమైన ఆరోపణలున్నాయి. అంతేగాక కోర్టులో కేసు కూడా న‌డుస్తోంది, అయినా .. కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇదే విషయంపై ఈ మధ్య చంద్రబాబుతో కాస్త సీరియస్ గానే మోదీ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసరమైతే ఆయ‌న స్థానంలో మరో నాయకుడి పేరు సూచించాల‌ని బాబుకు మోదీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో.. సుజనాకు ఎర్త్ తప్పదన్న అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ విష‌యంపై ఇప్పటికే చంద్రబాబు, సుజనా మధ్య చర్చలు నడుస్తున్నాయని.. పదవిని కాపాడుకునేందుకు ఏం చేయాలి అన్న విషయంపై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

ఏపీ త‌ర‌ఫున బీజేపీ పెద్ద‌ల‌తో మాట్లాడుతూ.. ఢిల్లీలో త‌న ప‌ర‌ప‌తి పెంచుకున్నారు సుజ‌నా! గ‌తంలో జ‌రిగిన విస్త‌ర‌ణ‌లోనూ ఆయ‌న్ను త‌ప్పిస్తార‌ని వార్త‌లు  గుప్పుమ‌న్నా.. త‌ర్వాత త‌న ప‌రిచ‌యాల‌తో ప‌ద‌వి కాపాడుకున్నారు. ఈసారి కూడా ఆయ‌న పేరే ముందుగా వినిపిస్తోంది. ఇంకొన్ని రోజులు ఆగితే.. సుజనా భవితవ్యం తెలిసిపోనుంది.