టీఆర్ఎస్‌లో రోజు రోజుకు హ‌రీశ్‌కు మైన‌స్సే

తెలంగాణ సీఎం కేసీఆర్ గీసిన గీత దాట‌ని వ్య‌క్తి.. పార్టీకి వ‌చ్చిన ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఒంటి చేత్తో ప‌రిష్క‌రించిన నాయ‌కుడు.. ఎక్క‌డ ఏఎన్నిక జ‌రిగినా.. ఎంత క‌ష్ట‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. త‌న వ్యూహాల‌తో విజ‌యాల‌ను అందించిన నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క హ‌రీశ్‌రావు మాత్ర‌మే!! ఆయ‌న‌కు కేసీఆర్ ఫ్యామిలీకి మ‌ధ్య గ్యాప్ ఉందనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్నా.. నేత‌లు వాటిని కొట్టిపారేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విష‌యం మ‌రోసారి వరంగ‌ల్ స‌భ‌లో బ‌య‌ట‌ప‌డింది. ధూంధాంగా జరుగుతున్న ఈస‌భ‌లో.. అన్ని వ్య‌వ‌హారాలు ద‌గ్గ‌రుండి చూసుకున్న హ‌రీశ్‌కు.. చివ‌రిక ద‌క్కింది వెనుక సీట్లే కావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం!!

తెలంగాణ వరంగల్ సభ ఏర్పాట్ల విషయంలో కష్టపడింది మంత్రి హరీష్ రావే. జ‌న‌స‌మీక‌ర‌ణ నుంచి ఇత‌ర వ్య‌వ‌హారాల‌న్నీ ఆయ‌నే దగ్గ‌రుండి చూసుకున్నారు. ఎక్క‌డ ఏ చిన్న పొర‌పాటు జ‌ర‌గ‌కుండా స్వ‌యంగా పర్యవేక్షించారు. కానీ సభా వేదికపై మాత్రం ఆయనకు ముందు వరసలో సీటు దక్కక‌పోవ‌డం విచార‌క‌రం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆయన కూడా సభా వేదిక మీదకు వచ్చారు. కానీ అప్పటికే ముందు వరస సీట్లు అన్నీ నిండిపోవటంతో ఇక త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. కొంత కాలంగా కేసీఆర్ ఫ్యామిలీ హరీష్ రావును దూరం పెడుతున్నట్లు ప్రచారం తెలంగాణ‌లో జరుగుతోంది. విప‌క్షాలు కూడా ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్రస్తావిస్తున్నాయి.

మ‌రి కొంద‌రు నాయ‌కులు ముందడుగు వేసి.. హ‌రీశ్ రావ్ కాంగ్రెస్‌లోకి రావాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికే పార్టీలో అందలాలు దక్కుతున్నాయని విమర్శ తొలి నుంచి ఉంది. ఇలాంటి సమయంలో హరీష్ కు ముందు వరస లో సీటు కేటాయించకపోవటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ఆయ‌న సూచించిన నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్క‌డం లేద‌నే అసంతృప్తి కూడా హ‌రీశ్ అనుచ‌రుల్లో బ‌లంగా నాటుకుపోయింది. మ‌రి ఈ విభేదాలు ఇప్ప‌టికైన చ‌ల్లార‌తాయో లేదో!!