ముంద‌స్తు ఎన్నిక‌లకే ఏపీ డిమాండ్లు ఇవే

ఎన్నికలు జ‌రిగి మూడేళ్లు ఇంకా పూర్త‌వ‌లేదు. కానీ అప్పుడే ఎన్నికల మాట దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అంతేగాక ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్రంలోని బీజేపీ భావిస్తోంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో అన్ని రాష్ట్రాలూ అందుకు అనుగుణంగా ఇప్ప‌టి నుంచే అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ఇప్పుడు ఈ ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి లీకులిస్తూనే ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశాలు నిర్వ‌హిస్తూ శ్రేణుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి.. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ పాటిస్తున్నాయి. డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఊహాతీత విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆ కాషాయ ద‌ళం త‌న‌కిక ఎదురు లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చింది. ఏడాది కంటే త‌క్కువ వ్య‌వ‌ధి ఉండ‌గానే ఎన్నిక‌ల‌కు వెళ్ళాల‌నే నిర్ణ‌యానికి మోడీ బృందం సిద్ధ‌మ‌వుతోంద‌న‌డానికి సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. రెండేళ్ళ త‌ర‌వాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయో… వేడిగా ఉండ‌గానే ఇనుమును సాగ‌దీయాల‌నుకుంటున్న‌ట్లు తోస్తోంది. నాలుగు దశాబ్దాల పైగా అనుభ‌వ‌మున్న ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఇలాంటివి అంచ‌నా వేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌.

అందుకే.. శుక్ర‌వారం నాటి స‌మావేశంలో తెలుగు దేశం పార్టీకి ఓటు బ్యాంకు ఎంత పెరిగిందీ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌కు ఎంత త‌గ్గిందీ చెప్పుకుంటూ వ‌చ్చారు చంద్ర‌బాబు. ఈ గ‌ణాంకాలు చెప్పిన అనంత‌రం, త్వర‌లోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వ్వాలంటూ చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌కు పట్టు ఉంద‌ని భావిస్తోంది. పైగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే, అసెంబ్లీ స్థానాలు 225కు చేర‌తాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ 200 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని మంత్రి నారా లోకేశ్ చెప్పిన విష‌యాన్ని కొంత‌మంది సోష‌ల్‌మీడియాలో వెక్కిరించినా.. దీని వెనుక మాత్రం అర్థం మాత్రం ఇదేన‌ని తెలుస్తోంది.

దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్ళాలంటే స‌గం రాష్ట్రాల అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. ఇప్ప‌టికే 16 రాష్ట్రాలలో నేరుగానో.. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసో బీజేపీ అధికారంలో ఉంది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు అంగీక‌రిస్తే టీడీపీ కూడా త‌న‌కు ఒనగూరే లాభాల‌ను బేరీజు వేసుకుని ఓకే చేసే అవ‌కాశ‌ముంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నారా లోకేశ్ అలా అని ఉంటార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఈ సూచ‌న‌లు చూస్తే దేశంలో ఒకేసారి ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌వ‌నాలు వీయ‌డానికి రంగం సిద్ధ‌మైపోతోంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.