హరీష్ ఈసారైనా సక్సెస్ అవుతాడా..!

టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొంది, ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి.. మేన‌మామ కేసీఆర్‌తో  ప్ర‌శంస‌లు అందుకున్న హ‌రీశ్‌రావు.. త‌న వ‌ర్గానికి ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు.  ముఖ్యంగా త‌న అనుచ‌రుడైన ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకునేందుకు ఆపసోపాలు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మ‌రోసారి త‌న అనుచ‌రుడి కోసం హ‌రీశ్ రంగంలోకి దిగారు. మ‌రి ఈసారైనా ఆయ‌న మాట చెల్లుబాటు అవుతుందో లేదోన‌నే సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి!

ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో మజ్లిస్ పార్టీకి ఒక సీటు పోగా మిగిలిన మూడు సీట్లు టీఆర్ఎస్ దక్కడం దాదాపు ఖాయం. అయితే అవి ఎవరికి దక్కుతాయనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో మొద‌టిగా వినిపించే పేరు ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌!! హ‌రీశ్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఆయ‌న్ను ప్ర‌తిసారి ఏదో ఒక ప‌ద‌వి ఊరించిన‌ట్టే ఊరించి ఉసూరుమ‌నిపిస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న దళిత నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ సీటు కోసం మంత్రి హరీశ్ రావు కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో ఆందోల్ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ చివ‌రి నిమిషంలో బాబు మోహ‌న్ రేసులోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్ ఎంపీ స్థానాన్ని ఆశించినా.. అక్క‌డ మొండిచేయే మిగిలింది. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీగా త‌న‌కు అవ‌కాశం ఇస్తార‌ని భావించినా అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. తాజాగా మ‌రోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఆయ‌న పేరు బ‌లంగా వినిపిస్తోంది. హరీశ్‌కూడా ఇదే అంశాన్ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఎర్రోళ్ల కంటే జూనియర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారని… ఎర్రోళ్లకు కూడా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఆయన కేసీఆర్ ను కోరినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఒకవేళ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నిజంగా ఎమ్మెల్సీ సీటు దక్కితే… అది పార్టీలోనూ, కేసీఆర్ దగ్గర హరీశ్ కు ఉన్న ప్రాధాన్యతకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. సామాజిక వ‌ర్గాల ప్ర‌కారం ఈసారి ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని అంతా భావిస్తున్నారు. అలాగే హ‌రీశ్ కూడా గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి ఈ సారైనా మేన‌ల్లుడి మాట నెగ్గుతుందో లేక‌.. కేసీఆర్ మాటే నెగ్గుతుందో వేచి చూడాల్సిందే!!