రేవంత్ ని రెచ్చగొడుతున్న కేసీఆర్… కారణం అదే

తెలంగాణ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఈమ‌ధ్య చాలా సైలెంట్ అయిపోయారు. మునుప‌టి స్థాయిలో దూకుడును ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌టం లేదు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహ‌భావంతో మెల‌గ‌డంతో రేవంత్ సైలెంట్ అయిపోయార‌నేది వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్ పేరు వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా ఆయ‌న మ‌రో కేసులో ఇరుక్కున్నారు. అయితే దీని వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తెలుగుదేశం నాయ‌కుడు రేవంత్ రెడ్డి… ప్ర‌తీరోజూ ఏదో ఒక కామెంట్‌తో వార్త‌ల్లో నిలిచేవారు. ముఖ్యంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమ‌ర్శించేవారు. రాజ‌కీయంగానే గాక వ్య‌క్తిగ‌తంగానూ ఆయ‌నపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఓటుకు నోటు కేసు విష‌యమై ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్యా ఏం డీల్ కుదిరిందో తెలీదుగానీ తావ‌ర‌ణం అంతా సైలెంట్ అయిపోయింది. ఇద్ద‌రు చంద్రులూ ఒక‌ట‌య్యారు. రేవంత్ సైలెంట్ అయ్యారు! కానీ, తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే… రేవంత్‌ని మ‌రోసారి రంగంలోకి తీసుకొచ్చేట్టుగానే ఉన్నారని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రేవంత్ రెడ్డిపై మైహోమ్స్ గ్రూప్స్ అధినేత రామేశ్వ‌ర‌రావు కేసు దాఖ‌లు చేశారు, రూ. 90 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ కేసుపై కోర్టు స్పందించ‌డం, రామేశ్వ‌ర‌రావు స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయ‌డం, వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. రేవంత్‌పై తాజా కేసు వేయ‌డం వెన‌క రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కూడా ఉండే ఉంటాయ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, టీడీపీల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని, తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికిని నిల‌బెట్టుకోవ‌డం కోస‌మే చంద్ర‌బాబు ఈ సంధి కుదుర్చుకున్నార‌నీ, అందుకే వ‌ల‌స‌లు ఆగాయ‌నీ ఇటీవ‌ల ఒక ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ డీల్ ప్ర‌కార‌మే అనుకుంటే.. `రేవంత్ మినహా` అనే కండిష‌న్ ఏదైనా తెరాస పెట్టిందేమో అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీల మ‌ధ్య రాజీ కుదిరినంత మాత్రాన‌… రేవంత్ విష‌యంలో తాము సైలెంట్‌గా ఉండ‌లేమ‌న్న అభిప్రాయం తెరాస నుంచి వ్య‌క్త‌మైంద‌ట‌. పైగా, కేసు పెట్టిన‌వారు కూడా కేసీఆర్‌కు స‌న్నిహితులే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోసారి కేసీఆర్‌పై దాడికి రేవంత్ సిద్ధ‌మ‌వ్వాల్సిందే!!