టీడీపీలో కులమే ఫ్లస్ – మైనస్ అయ్యిందిగా..!

స‌మ‌ర్థ‌త‌, సీనియారిటీతో పాటు సామాజిక వ‌ర్గం కూడా ఎమ్మెల్సీ ఎంపిక‌లో కీల‌క పాత్ర పోషించింది. ఈ విష‌యం డొక్కా మానిక్య వ‌ర ప్ర‌సాద్ ఎంపికలో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఆశించిన సీనియ‌ర్ నేత పుష్ప‌రాజ్ తీవ్రంగా భంగ‌ప‌డ్డారు! ఏకంగా సీఎంపైనే విమ‌ర్శ‌లు చేసినా.. సీనియారిటీ కోటాలో త‌న‌కు ఎమ్మెల్సీ త‌ప్ప‌ద‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కానీ ఆయన్ను ఎంపిక చేయ‌క‌పోవ‌డానికి, డొక్కాను ఎంపిక చేయ‌డానికి వారి కుల‌మే ప్ర‌ధాన‌మ‌నేది పార్టీ వ‌ర్గాల స‌మాచారం!!

గుంటూరు జిల్లాలో 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యే, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పుష్పరాజ్‌.. ఎమ్మెల్సీ ద‌క్క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. త‌న‌కు ఇవ్వ‌కుండా నిన్న గాక మొన్న వ‌చ్చిన మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. అయితే ఇందులో కుల ఈక్వెషన్స్ బాగా ప‌నిచేశాయ‌ట‌. ఎందుకంటే పుష్పరాజ్‌ దళితవర్గంలోని మాల వర్గానికి చెందిన వారు కాగా, మాణిక్యవరప్రసాద్‌ మాదిగ వర్గానికి చెందిన వారు. ఇదే వరప్రసాద్‌కు బాగా కలిసి వచ్చింది.

కాంగ్రెస్‌ వ్యతిరేకిగా పుష్పరాజ్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు అమ్ముకుంటున్నారన్న  ప్రకటనే ఇప్పుడు ఆయన కొంప ముంచింద‌ట‌. ఎన్ని పదవులిఇచ్చినా, ఎంత ప్రోత్సహించినా పుష్పరాజ్‌ తన సామాజికవర్గానికి చేరువ కాలేకపోయారని చంద్రబాబు భావిస్తున్నారు. పుష్పరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 90శాతంపైగా జగన్‌ పార్టీ అభిమానులేనని, వారికి ఎన్ని సౌకర్యాలు కల్పించినా, వారికి ఎన్ని పనులు చేసిపెట్టినా ఎటువంటి మార్పు రాలేదని పాలకులకు తెలిసివచ్చింది. ఇదే స‌మ‌యంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని పార్టీ నాయకులు చంద్ర‌బాబుకు స్ప‌ష్టంచేశార‌ట‌.

దీంతో త‌న‌కు విధేయత కన్నా, సమర్థత ముఖ్యమని, మళ్లీ పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని సామాజికవర్గాలకు చేరువ‌కావాల్సిందేన‌ని చంద్రబాబు ఇటీవల కొందరితో వ్యాఖ్యానించారట. అలాగే డొక్కాకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం వెనుక ఎంపీ రాయ‌పాటి కూడా బాగా లాబీయింగ్ చేశార‌ట‌. డొక్కాకు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని బాబుపై ఒత్తిడి తెచ్చార‌ట‌. ఇటువంటి వేమీ చేయ‌కుండానే.. కేవలం సినియారిటీ ఆధారంగా త‌న‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని పుష్ప‌రాజ్ అతివిశ్వాసంతో ఉన్నారట‌. అలాగే నోటి దురుసు తగ్గించుకోవాల‌ని చెప్పినా విన‌క‌పోవ‌డంతో పుష్ప‌రాజ్‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.