కోడెల‌ మ‌ధ్య‌లో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెందిన మీడియా సంస్థ‌ల‌పై టీడీపీ త‌న అధికార దండాన్ని ప్ర‌యోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాస‌న‌స‌భ‌లో మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శనంగా కనిపిస్తున్నాయి! మ‌హిళా పార్ల‌మెంటు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రించార‌ని, ఇందుకు సాక్షి మీడియాపై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జ‌రిగిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం వెనుక కూడా అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో కోడెలను అడ్డుపెట్టుకుని ఎలాగైనా సాక్షిపై త‌మ ప్ర‌తాపం చూపాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని వైసీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇప్పుడు ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది, మ‌హిళ‌ల‌ను కార్ల‌తో పోల్చుతూ.. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు దాదాపు అంతా మ‌రిచిపోయారు, కానీ వీట‌ని మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తెచ్చింది, ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాన్ని కార్న‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది, ఆయ‌న వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర‌చేలా ఉన్నాయంటూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కు చెందిన మీడియా సంస్థ‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ త‌రువాత‌, జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని కొన్ని రోజుల‌పాటు హైలైట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ వివాదం ముగిసి చాలా రోజులైంది.

స్పీక‌ర్ స్థానాన్ని కించ‌ప‌ర‌చేలా  కోడెల వ్యాఖ్య‌ల్ని వ‌క్రీక‌రించిన జ‌గ‌న్ మీడియాపై స‌భ చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా దీనిపై స్పందించి, స్పీక‌ర్ ను అగౌర‌వ ప‌ర‌చ‌డం అంటే, రాష్ట్రంలోని అత్యున్న‌త చ‌ట్టస‌భ స‌భ్యుల‌ను కించ‌ప‌ర‌చిన‌ట్టుగానే భావించాలన్నారు. అయితే, ఉన్న‌ట్టుండి ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు..? అనేది అర్థంకాని అంశ‌మే! అయితే దీని వెనుక వ్యూహ‌మేంటంటే.. స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్ర‌తిప‌క్షం సిద్ధ‌మైంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యం చూసుకుని కావాల‌నే పాత ఇష్యూని తెలుగుదేశం తెర మీదికి తెచ్చింద‌ని అనిపిస్తోంది.

ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్న సాక్షి మీడియాపై ఎప్ప‌టి నుంచో అధికార పార్టీ క‌న్ను ఉంది. ఈ నేప‌థ్యంలో సాక్షి మీడియాని కార్న‌ర్ చేయ‌డానికి టీడీపీ వేసిన స్కెచ్ కావొచ్చ‌ని చెబుతున్నారు. అయితే మీడియాపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం స‌భకు ఉంటుందా అనేది ప్ర‌ధాన‌మైన చ‌ర్చ‌. స‌భ బ‌య‌ట కూడా స్పీక‌ర్ అధికారాలు వ‌ర్తిస్తాయా అనేది కూడా ఆలోచించాలి! ఏది ఏమ‌యినా.. కోడెల‌ను మ‌ధ్య‌లో ఉంచి.. జ‌గ‌న్ మీడియాపై ఏదో ఒక ర‌కంగా చ‌ర్య‌ల‌కు దిగేందుకు ఈ ఇష్యూను ఒక అస్త్రంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మౌతోంది.