ఏపీ క్యాబినెట్‌లో ఇన్ అండ్ అవుట్ వీళ్లే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా చేరికలు, కొందరి ‘తీసివేతలు’, మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2వ తేదీనే దీనికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏవైనా కారణాలవల్ల 2వ తేదీ కుదరకపోతే… 6న కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. కాగా కొత్త‌గా మంత్రివర్గంలోకి 8 నుంచి 10 కొత్త ముఖాలు వచ్చే అవ‌కాశ‌ముంద‌నే ప్ర‌చారం అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోంది.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరినైనా తొలగిస్తే వారి స్థానంలో ఆయా జిల్లాలు, సామాజిక వర్గాల నుంచే కొత్త వారిని భర్తీ చేయాలి. పాతవారితో సంబంధం లేకుండా భర్తీ చేయగలిగిన సీట్లు నాలుగు లేక ఐదు ఉన్నాయి. సీఎం తనయుడు లోకేశ్, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ముస్లిం మైనారిటీల నుంచి ఒకరిని తీసుకోవాలన్న యోచన పార్టీ నాయకత్వంలో ఉంది. ఈ వర్గం నుంచి ఎమ్మెల్సీల్లో ఎంఎ షరీఫ్‌, ఎమ్మెల్యేల్లో జలీల్‌ ఖాన్, చాంద్‌ బాషా ఉన్నారు. ఈ వర్గానికి కూడా ప్రాతినిధ్యం ఇస్తే కొత్తగా భర్తీ చేసే మంత్రి పదవుల్లో ఒకటి లేదా రెండు మాత్రమే మిగులుతాయి.

ఏదైనా జిల్లా నుంచి అదనంగా ఇవ్వాలని అనుకొన్నా… మరేదైనా సామాజిక వర్గానికి కొత్తగా చోటు కల్పించాలని భావించినా ఈ ఒకటి రెండు స్థానాల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దక్షిణ కోస్తాలో తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్న ఒక మంత్రి మార్పు తథ్యమని తెలుస్తోంది. ఒక మహిళా మంత్రి నిజాయ‌తీ విషయంలో తప్పుపట్టే పరిస్థితి లేకపోయినా, రాజకీయంగా ఆ జిల్లాలో పార్టీకి ఉపయోగపడే పరిస్థితి లేకపోవడంతో ఆమెను మార్చనున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేని ఒక సీనియర్‌ మంత్రి కూడా ఉన్నార‌ట‌. మరో మంత్రి చురుగ్గా ఉన్నా తన శాఖపై ఏ మాత్రం పట్టు సాధించలేకపోయార‌ట‌.

మరో మంత్రి ఆరోపణల్లో చిక్కుకోవడంతోపాటు రాజకీయంగా జిల్లాలో పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేకపోవడంతో… ఆయననూ తప్పించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చేతిలో పెద్ద శాఖలు ఉన్నా వాగ్దాటి అసలు లేక మౌన మునిలా వ్యవహరిస్తున్న మరో మంత్రి పరిస్థితిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రి ఈ లెక్క మ‌రికొన్ని రోజుల్లో తేలిపోనుంది.