అసంతృప్తితో కాపులు ఆ పార్టీకి దూరం…దూరం

తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే బ‌లం పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోంది. అన్ని వ‌ర్గాల‌ను కూడ‌దీసుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న ఆ పార్టీకి.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం షాక్ ఇవ్వ‌బోతోంది. పార్టీలో త‌మకు సరైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని, అన్యాయం జ‌రుగుతోంద‌ని కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. దీంతో ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇది కాంగ్రెస్‌కు శ‌రాఘాత‌మే అయ్యే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్‌కు మొద‌టి నుంచి నిలుస్తున్న కాపులు ఇప్పుడు  ఆ పార్టీకి దూర‌మైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలిన‌ట్టే!!

ఇప్పటికే తెలంగాణలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి మరో కీలక వర్గం దూరమవుతోందని వార్తలు వెలువడు తున్నాయి. తెలంగాణలో బలమైన కులాల్లో ఒకటైన కాపులు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి అధికార టీఆర్ ఎస్ పార్టీకి చేరువ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ అధిష్టానం చర్యలు కొందరు నాయకుల వ్యవహారశైలితో కాపు నేతలు కాంగ్రెస్ కు దూరం అవుతున్నారని విశ్లేషిస్తున్నారు.  తెలంగాణలో రెడ్డి కులస్తుల తర్వాత కాపులు రెండో బలమైన సామాజికవర్గం. తెలంగాణలో దాదాపు 27 శాతం జనాభా కాపులదే (మున్నురు కాపులని తెలంగాణలో అంటారు) రెడ్డిల జనాభా కేవలం 4.7 శాతం ఉంది.

కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అనూహ్య రీతిలో పీసీసీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించడంతో పార్టీ వర్గాల కాపులను దూరం పెడుతున్నాయనే విశ్లేషణకు బీజం వేశాయని అంటున్నారు.  పీసీసీ అధ్యక్షుడి హోదాలో పనిచేసి సీనియర్ నేతగా పేరొందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్(డీఎస్)కు  కాంగ్రెస్ లో తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తుచేస్తున్నారు. అందుకే ఆయన టీఆర్ ఎస్ లో చేరారని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నేతి విద్యాసాగర్ సైతం కాంగ్రెస్ పై అసంతృప్తితో టీఆర్ ఎస్ లో చేరార‌ని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాపులలోని రెండో తరం నాయకులు ఇప్పటికే తమ సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. కాపులు కీలకంగా ఉన్న నల్లగొండ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – వరంగల్ – కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులు తాము కాంగ్రెస్కు గుడ్ బై చెప్తామని ఇప్పటికే సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మెజార్టీ రెడ్డి నేతలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. త్వరలో కాపుల ద్వారా కాంగ్రెస్ ను మరింత బలహీనం చేస్తారని అంచనా వేస్తున్నారు.