మిత్ర‌పక్షాన్ని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, మ‌జ్లిస్‌ల బంధం లోపాయికారీగానే కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. అవి వారి మిత్ర బంధాన్ని చెడగొట్టే స్థాయిలో ఉండ‌వు! అయితే ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు భగ్గుమ‌న్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నిక రెండు పక్షాల మధ్య విబేధాలకు దారితీసిందట‌. అధికార టీఆర్ఎస్‌ నిర్వ‌హించిన స‌మావేశానికి ఎంఐఎం త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంది. దీంతో ఇన్నేళ్ల మిత్రబంధానికి శుభం కార్డు ప‌డ‌వ‌చ్చనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యులు, ఛైర్మన్ ఎన్నికల వ్యవహారం అధికార టీఆర్ఎస్ పార్టీతో మిత్రపక్షమైన ఎంఐఎంల మధ్య విబేధాలు రాజుకున్నాయి. వక్ఫ్ బోర్డుకు తమ పక్షాన ఇద్దరు సభ్యులను నియమించాలని మిత్రపక్షమైన ఎంఐఎం ప్రతిపాదించగా అధికారపక్షం దాన్ని తోసిపుచ్చిందని సమాచారం. దీంతోపాటు బోర్డు ఛైర్మన్ అభ్యర్థి విషయంలోనూ అధికార పక్షానికి ఎంఐఎంల మధ్య పొరపొచ్చాలు వచ్చాయట‌. దీంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నికల సమావేశంలో ఎంఐఎం నేతలు పాల్గొనక పోవడం చర్చ‌నీయాంశ‌మైంది.

దీంతోపాటు బోర్డు ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఎంఐఎం నేతలు గైర్హాజరు అయ్యారు. ఈ ఘటనలతో అధికార టీఆర్ఎస్ తో ఎంఐఎం మధ్య విబేధాలు రాజుకున్నాయని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. రెండు పక్షాల మధ్య రాజుకున్న విబేధాలు తమ మధ్య ఉన్న మిత్రత్వానికి విఘాతం వాటిల్లవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.