ఆ ఈక్వేష‌న్స్‌కు బ‌లైన ప‌న్నీరు సెల్వం

కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులో చెల‌రేగిన జ‌ల్లిక‌ట్టు వివాదం కేంద్రం దిగి రావ‌డంతో తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత అక్క‌డ స్టార్ట్ అయిన పొలిటిక‌ల్ జల్లికట్టులో చివ‌రి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్‌)ని వ‌రిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్‌) ప‌రాజితుడు అవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు త‌మిళ జ‌నాలంద‌రూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గ‌తంలోనే రెండుసార్లు అమ్మ జ‌య‌ల‌లిత జైలుకు వెళ్ల‌డంతో సీఎం అయిన ప‌న్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మ‌కోసం త‌న ప‌ద‌విని పువ్వుల్లో పుట్టి తిరిగి ఆమెకు ఇచ్చేశారు.

అమ్మ‌కు వీర‌విధేయుడిగా ఉండే ఓపీఎస్ చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు కూడా అంతే వీర‌విధేయుడిగా ఉండేవాడు. ఒక వేళ తాజాగా ఆయ‌న సీఎం అయిన వెంట‌నే శ‌శిక‌ళ‌పై తిరుగుబాటు చేయ‌కుండా ఉంటే ఆయ‌నే సీఎంగా ఉండేవారు. త‌ర్వాత శ‌శిక‌ళే సీఎం అయ్యేది. ఒక‌వేళ శ‌శి జైలుకు వెళ్లి వ‌చ్చాక కూడా ఆమె కోసం మ‌రోసారి ఓపీఎస్ త‌న సీఎం సీటు త్యాగం చేయాల్సి వ‌చ్చేది.

ఎప్పుడైతే ప‌న్నీరు త‌న‌కు వ్య‌తిరేకంగా మారారో అప్పుడే శ‌శిక‌ళ ఎలాగైనా ప‌న్నీరును తొక్కేయాల‌ని ఆమె పెద్ద స్కెచ్చే వేసింది. అందుకే ముందుగా తాను సీఎం అవ్వాల‌నుకున్నారు. దానిని త‌న అక్క కొడుకు దిన‌క‌ర‌న్‌ను ప‌క్క‌న పెట్టి వ్యూహాత్మ‌కంగా ప‌ళ‌నిస్వామిని తెర‌మీద‌కు తెచ్చారు. ఇక్క‌డే శ‌శి క్యాస్ట్ ఈక్వేష‌న్స్ బాగా ప‌నిచేసింది.

శశికళ అనుసరించిన దేవర్‌+గౌండర్‌ వ్యూహానికి పన్నీర్‌ చిత్తయ్యారని, ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలమయ్యారని విశ్లేష‌కులు చెపుతున్నారు. ఇక ఎంతో అండగా నిలుస్తాయ‌నుకున్న కేంద్రం+బీజేపీ+మోడీతో పాటు డీఎంకే కూడా సైలెంట్ అయిపోవ‌డం ప‌న్నీరును దెబ్బేసింది.

ఇక ప‌న్నీరుకు అండ‌గా నిలుస్తార‌ని అనుకున్న ఎమ్మెల్యేలు సైలెంట్ అవ్వ‌డం వెన‌క మ‌రో ట్విస్ట్ ఉంది. ప్ర‌స్తుతం సీఎం అయిన ప‌ళ‌నిస్వామి గౌండ‌ర్ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. దీంతో ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు మా పళనిస్వామి సీఎం అవుతున్నప్పుడు మేం ప‌న్నీరుకు ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాలి ? అన్న ప్ర‌శ్న లేవ‌నెత్తారు. దీంతో ప‌న్నీరుకు క‌న్నీరే మిగిలిన‌ట్ల‌య్యింది.