స్విస్ ఛాలెంజ్‌లో మ‌రో ట్విస్ట్‌

ఏపీ రాజ‌ధానిలో కీల‌క‌మైన కోర్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ విష‌యం మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. రాజ‌ధానిలోని ప్ర‌ధాన నిర్మాణాల‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధ‌తిలో నిర్మించాల‌ని సీఎం చంద్ర‌బాబు భావించారు. అయితే, ఈ విష‌యంలో ప‌లు సందేహాలు రావ‌డం.. విష‌యం కోర్టుల వ‌ర‌కు వెళ్ల‌డంతో దీనిపై వెన‌క్కి త‌గ్గారు. మ‌రో మార్గంలో రాజ‌ధాని నిర్మాణాల‌కు టెండ‌ర్లు పిలుస్తామ‌ని కోర్టు కు విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా టెండ‌ర్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇప్పుడైనా కొత్త విధానాన్ని రూపొందించారా? అంటే అది సందేహం గానే క‌నిపిస్తోంది. ఒక‌ప‌క్క కోర్టు వ‌ద్ద‌న్న విధానంలోనూ మ‌రో సారి చేతులు కాల్చుకునేందుకు ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది.

రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ‌(క్రిడా)కు నిర్మాణ సంస్థ‌ల ఎంపిక బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం అప్ప‌గించింది. గ‌తంలోనూ ఇదే ప‌ద్ధ‌తి అవ‌లంబించ‌డంతో కోర్టు ఆదేశాల‌తో వెన‌క్కి త‌గ్గినా.. మ‌రోసారి మ‌ళ్లీ అప్ప‌గించింది. అయితే, ఇప్పుడు నేరుగా కాకుండా కంపెనీల ఎంపిక‌ను క్రిడా నియ‌మించే సాంకేతిక క‌మిటీకి అప్ప‌గించింది. ఈ మేర‌కు జనవరి 2న విడుదలైన జీవో ప్రకారం సవరణలకు చట్టబద్దత కల్పించింది. అయితే వాస్తవంగా మాష్టర్‌ డెవలపర్‌ ఎంపిక అధికారం వుండేది ప్రధాన కార్యదర్శికి మాత్ర‌మే. అయితే, సాంకేతిక కమిటీకే అప్పగించడం ద్వారా మరోసారి క్రిడాకే సర్వాధికారం కల్పించినట్ట‌వుతుంది. ఎందుకంటే, క్రిడా క‌నుస‌న్న‌ల్లోనే సాంకేతిక బృందం ప‌నిచేయ‌నుంది.

దీంతో ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణ బాధ్య‌త‌ల‌ను సింగపూర్‌ కంపెనీలకే అప్ప‌గించ‌వ‌చ్చ‌నే ప్రచారం సాగ‌తోంది. ఇతరులు దాఖలు చేసేది ఎంతైనా అంతకన్నా తక్కువ చూపించి వారికి నచ్చిన సంస్థతోనే ప్రతిపాదన చేయించవచ్చు. తర్వాత కావాలంటే ఇతరేతర నిబంధనల కింద పెంచుకునే అవకాశం ఎలాగూ వుంటుంది. నామకార్థంగా కోర్టు ఆదేశాలు పాటించినట్టూ వుంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ తతంగంతో డెవలపర్‌ ఎంపికకు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విధంగా క్రిడా చేతుల్లో అధికారం పెట్టడం కూడా చెల్లుబాటు కాదని మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎస్‌ శర్మ స్పష్టం చేశారు. మ‌రి ఏం జ‌రుగుతందో చూడాలి.