`ర‌ద్దు డ్యామేజ్` కంట్రోల్‌కు మోడీ ప్లాన్‌

దేశంలో 80 శాతానికి పైగా చ‌లామ‌ణీలో ఉన్న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. అవినీతిని అంతమొందించేందుకేన‌ని ప్ర‌ధాని చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. అయితే రెండున్న‌రేళ్లుగా ప్ర‌ధాని మోడీని ఆకాశానికెత్తేసిన అంత‌ర్జాతీయ‌ మీడియా.. ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా విమ‌ర్శించింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కి బీజేపీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ నిర్ణ‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించేందుకు తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

50 రోజులు ఆగాల‌న్నారు. ప్ర‌జ‌లు స‌హ‌నంగా స‌హ‌క‌రించాల‌ని కోరారు. త‌ర్వాత అద్భుతాలు జ‌రుగుతాయ‌ని ఆశ చూపారు. ఆ మాట‌లు ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఎన్ని క‌ష్టాలు ప‌డినా భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కముంచి క‌ష్టాలకోర్చారు. 50 రోజులు గ‌డిచాయి. అద్భుతాలేమీ జ‌ర‌గ‌లేదు క‌దా.. అస‌లు న‌ల్ల‌ధ‌నం గురించి ప్ర‌స్తావ‌నే లేదు! ఒకే ఒక్క నిర్ణ‌యం దేశ గ‌తిని మార్చేస్తుంద‌ని ప్ర‌క‌టించింది బీజేపీ. ఇది సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యంగా అభివ‌ర్ణించింది. అయితే దీని వెనుక ఉన్న అస‌లు ఉద్దేశం ప‌క్క‌కు పోయి డిజిట‌ల్ ఇండియా అని వ‌ల్లిస్తున్నారు. మొత్తంగా మోడీ నిర్ణ‌యం ప్లాప్ అయింది.

నోట్ల‌రద్దు బీజేపీకి, మోడీకి పెద్ద దెబ్బ‌గా ప‌రిణ‌మించింది. ప్ర‌జ‌ల్లో దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం వెల్లువెత్తింది.  ప్ర‌స్తుతం కేంద్రం ద‌గ్గ‌ర ఉన్న ఒకే ఒక్క ఆప్ష‌న్‌… ప్ర‌జ‌ల‌ను సంతృప్తిప‌ర‌చ‌డం! అందుకే, ఇప్పుడు జ‌నాక‌ర్ష‌క నిర్ణ‌యాల‌వైపు మ‌ళ్లుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పేద నిరుద్యోగుల‌కు భృతి ఇచ్చే ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌తీ పేద నిరుద్యోగికీ ఏడాదికి రూ. 5 వేలు ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట! బ‌డ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని హ‌స్తిన వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌్ర‌స్తుత కాల‌మాన ప‌రిస్థితుల్లో, ద్ర‌వ్యోల్బ‌ణ స్థితిగ‌తుల్లో, పెరుగుతూ పోతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నేప‌థ్యంలో.. కేంద్రం ఇచ్చే ఈ ఐదు వేలూ దేనికి స‌రిపోతాయనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మోడీ ఈ కొత్త ప్లాన్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల‌ను ఎంత వ‌ర‌కు త‌గ్గిస్తుందో చూడాలి.