టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

పాలిటిక్స్‌లో ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వ‌త మిత్రులు కారు. శాశ్వ‌త శ‌త్రువులు కారు! అది నేత‌లు ఒకే పార్టీలో ఉన్నా.. లేక రెండు పార్టీల్లో ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఉద్య‌మాల జిల్లా ఓరుగ‌ల్లులో టీఆర్ ఎస్ కీల‌క నేత‌లుగా సీఎం కేసీఆర్ వ‌ద్ద మార్కులు కొట్టేసిన ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌లు ఇద్ద‌రూ ఇప్పుడు ఉప్పు నిప్పులా త‌యార‌య్యార‌ట‌! ప్ర‌జ‌ల్లో అభిమానం చూర‌గొన్న ఇద్ద‌రు నేత‌లూ పార్టీకి ఎంతో తోడ్ప‌డ‌తార‌ని అధిష్టానం భావిస్తుంటే.. వీరిద్ద‌రు చిన్న చిన్న కార‌ణాల‌తో క‌య్యానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ రూప‌శిల్పిగా ప‌సునూరి.. కేసీఆర్ వ‌ద్ద పెద్ద ఎత్తున అభిమానం సంపాదించాడు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న జిల్లాలో సొంతంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌నే టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే  జనవరి ఒకటో తేదిన పసునూరి దయాకర్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిని స్థానిక ఎమ్మెల్యే టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత వినయ్ భాస్కర్ తప్పుబట్టారు. విష‌యం గ్ర‌హించిన దయాకర్ అప్పటికప్పుడే ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌డంపై స్పందించి.. జరిమానా కట్టారు. దీంతో వీరి మధ్య విభేదాలు మ‌రింత‌గా ముదిరాయి.

ఎంపీ ప‌సునూరి దయాకర్ కొండా సురేఖ వర్గంతో సన్నిహితంగా ఉండటం వల్లే వినయ్ భాస్కర్ కు దయాకర్ కు మధ్య గ్యాప్ రావడానికి కారణమైందని తెలుస్తోంది. మరోవైపు తనను వినయ్ భాస్కర్ లెక్క చేయడం లేదనే కారణంగా దయాకర్ కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నారని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ఈ కార‌ణంగానే ఒక‌రి ఒక‌రు తీవ్ర ఆగ్ర‌హావేశేల‌తో ఉన్నార‌ని అంటున్నారు. మరి… వరంగల్ జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పెరిగిన ఈ గ్యాప్ ను తగ్గించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారిస్తుందా లేదా అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికైతే.. ఫ‌ర్వాలేదు కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వీరి వైఖ‌రి విప‌క్షాల‌కు అవ‌కాశం పెంచేదిగా మారితేనే ఇబ్బందులు. ఏం జ‌రుగుతుందో చూడాలి.