మంత్రి సుజాత‌పై బాలయ్య ఫాన్స్ ఫైర్‌

న‌ట‌రత్న‌ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిష్ఠాత్మ‌క 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌ద‌ర్శిస్తున్న‌ థియేట‌ర్ సీజ్ చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పీత‌ల సుజాత ఇందులో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ అంశంలో త‌లెత్తిన వివాదం అనేక మ‌లుపులు తిరిగి రాజ‌కీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పీత‌ల సుజాత‌పై బాల‌య్య అభిమానులు, టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో పండగ ముందు ‘కొత్త సినిమా’ రిలీజ్‌ అయ్యింది. ఒక థియేటర్‌ను అధికారులు సీజ్‌ చేయడంతో అధికార పక్షం ముఖ్య నేతల మధ్య వివాదం నెల‌కొంది. కామవరపుకోట మండలం తడికలపూడిలో ఒక థియేటర్‌ను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. య‌థాప్ర‌కారం ఆ థియేట‌ర్‌ను ఆయ‌న లాంఛ‌నంగా ప్రారంభించారు. అయితే జిల్లాకు చెందిన‌ మంత్రి పీతల సుజాతకు ఈ విషయంలో ఎలాంటి ఆహ్వానం లేదు. ప్రభుత్వ విప్‌ను మాత్రమే పిలిచి తనను విస్మరించారని ఆమె ఆగ్ర‌హానికి గుర‌య్యారు. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకున్నారు. అయితే అస‌లు సినిమా ఇక్క‌డే మొద‌లైంది.

థియేటర్‌ ప్రారంభమైన తరువాత మొదటి ఆటగా మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం ప్రదర్శించారు. గురువారం ఉదయం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అధికారులు థియేటర్‌కు వెళ్ళారు. తగినన్ని అనుమతులు, సౌకర్యాలు లేవనే ఫిర్యాదుపై స్థానిక తహశీల్దారు నరసింహరాజు సీజ్ చేయ‌డం క‌ల‌కలం సృష్టించింది. అయితే ఇందులో రాజ‌కీయ ప్ర‌మేయం ఉంద‌నే వ‌దంతులు వినిపించాయి. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి త‌న‌ను ఆహ్వానించ‌నందుకే మంత్రి సుజాత ఇటువంటి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విష‌యంపై విప్‌ ప్రభాకర్‌ స్వయంగా మంత్రితో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఇన్‌చార్జ్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు, పార్టీ పరిశీలకుడు రెడ్డి సుబ్రహ్మణ్యంకు చేరవేశారు. అయ్యన్న జోక్యం చేసుకుని వివాదానికి ఇంతటితో తెర దించాలని కోరినట్టు సమాచారం. బాల‌య్య సినిమా ప్ర‌ద‌ర్శిస్తుండ‌గానే సినిమా సీజ్ చేయ‌డంపై బాల‌య్య అభిమానులు మంత్రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.