జ‌గ‌న్ ద్రోహుల గుప్పెట్లో సాక్షి మీడియా

తెలుగు వారి మ‌న‌స్సాక్షి.. సాక్షి! అంటూ తెలుగు లోగిళ్ల‌లోకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాక్షి దిన‌ప‌త్రిక ఓ సంచ‌ల‌నం! అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మీడియా ఆధిప‌త్యానికి గండి కొడుతూ.. కేవ‌లం రూ.2కే దాదాపు 18 నుంచి 20 పేజీల‌తో స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించిన ప‌త్రిక అత్యంత స్వ‌ల్ప కాలంలోనే తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకుని.. తెలుగు లోగిళ్ల‌కు ద‌గ్గ‌రైంది. వాస్త‌వానికి కాంగ్రెస్ అనుకూల ప‌త్రిక‌గా అరంగేట్రం చేసినా.. ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ స్థాపించిన వైకాపాకి అండ‌, దండ‌గా ఉంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ల‌క్ష్యంగా వెలువ‌రించిన క‌థ‌నాల‌కు లెక్క‌లేదు.

దీంతో ప్ర‌జ‌ల్లోని ఓవ‌ర్గానికి ప‌త్రిక అత్యంత ద‌గ్గ‌రైంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు సాక్షిలో జ‌నాలే సాక్షిని నిలువునా ముంచుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి సాక్షి ప‌త్రిక వైకాపాకు మాన‌స పుత్రిక‌. వైకాపా సిద్ధాంతాల‌ను, దాని భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం సాక్షి ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. అదే స‌మ‌యంలో సాక్షిని వ్య‌తిరేకించేవారు, సాక్షిని విభేదించేవారిని తీవ్రంగా ఏకేయ‌డ‌మూ ప‌త్రిక కోణంలో భాగ‌మే. అయితే, రానురాను ఈ స్ఫూర్తి కొర‌వ‌డుతోంద‌ని తెలుస్తోంది. వైకాపాను విభేదించేవారిని, ప‌త్రిక అధినేత‌ను విమ‌ర్శించే వారిని ఏకేయాల్సిన సాక్షి సైన్యం.. రివ‌ర్స్ గేర్‌లో దూసుకుపోతోంద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల వైకాపా నుంచి పెద్ద ఎత్తున చంద్ర‌బాబు పార్టీలోకి నేత‌లు జంప్ చేశారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పంచ‌న చేరి.. జ‌గ‌న్ జెండాపై గెలిచి.. అవ‌స‌రం కోసం అంటూ.. టీడీపీ సైకిల్ ఎక్కేశారు. అదేస‌మ‌యంలో భూమా నాగిరెడ్డి, విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ వంటి వాళ్లు.. జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా స‌వాళ్లు కూడా రువ్వారు. ఈ స్థాయిలో వాళ్లు వైకాపా మీద‌, ఆ పార్టీ అధినేత మీద రెచ్చిపోతే.. సాక్షి సైన్యం ఏంచేయాలి? అలాంటి వాళ్లను ఎదురు ఏకేయాలి. వాళ్ల లూప్ హోల్స్ క‌నిపెట్టి బ‌ట్ట‌బ‌య‌లు చేయాలి. మ‌రోసారి సాక్షి జోలికి వెళ్తే.. అనుకునే ప‌రిస్థితి క‌ల్పించాలి.

కానీ, అలా జ‌రుగుతోందా? అంటే ప్ర‌శ్నార్థ‌కంగా ఉంది! సీమ స‌హా ప‌లు ప్రాంతాలో సాక్షి జోన్ పేజీలు వైకాపా ఫిరాయింపు దారులకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వైకాపాను ఎడం కాలితో త‌న్ని సైకిలెక్కిన వారి ఫొటోలు, వార్త‌లు నిత్యం క‌వ‌ర్ చేస్తున్నార‌ట‌. దీంతో దీని వెనుక ఏమైనా? ఉందేమోన‌ని ఆరాతీయ‌గా.. భ‌యంక‌ర మైన నిజం వెలుగు చూసింది. ప్ర‌స్తుతం బ్యూరో నుంచి కంట్రిబ్యూట‌ర్ స్థాయి వ‌ర‌కు సాక్షిలో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల సిఫార‌సులతో ఉద్యోగం పొందిన‌వాళ్లేన‌ట‌. దీంతో వాళ్లు.. ఇప్పడు కూడా త‌మ స్వామి భ‌క్తిని చాటుకుంటున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ ఈ వైఖ‌రిని ఎలా అడ్డుకుంటాడో చూడాలి.