చంద్ర‌బాబు అటు – య‌న‌మ‌ల ఇటు

నోట్ల ర‌ద్దుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి  వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయి. నోట్ల ర‌ద్దుతో ఏపీకి లాభ‌మని ఒక‌రు.. అబ్బెబ్బే లాభ‌మేదీ లేదు అంతా న‌ష్ట‌మే అని మ‌రొక‌రు!! న‌గ‌దు రహిత లావాదేవీలతో ఏపీకి ఆదాయం బాగా పెరిగింద‌ని సీఎం ఒక‌ప‌క్క ఆనందం వ్య‌క్తంచేస్తుంటే.. న‌గ‌దు ర‌హితంతో రాష్ట్రం ఆర్థికంగా  కుదేలైంద‌ని ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోదీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తొలుత స్వాగ‌తించిన సీఎం.. చంద్ర‌బాబు! దీని వ‌ల్ల అవినీతి అంత‌మ‌వుతుంద‌ని, దేశం డిజిట‌ల్ లావాదేవీల వైపు అడుగులేస్తుంద‌ని కితాబిచ్చేశారు కూడా! అంతేగాక మ‌రో అడుగు ముందుకేసి.. `న‌గ‌దు ర‌హిత లావాదేవీల్లో మ‌న‌మే ముందున్నాం `అని అనేక సందర్భాల్లో హ‌ర్షం వ్య‌క్తంచేశారు. డిజిట‌ల్ లావాదేవీలు పెంచేందుకు రాష్ట్రంలో ఎన్నో సౌక‌ర్యాలు ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని భ‌విష్య‌త్తులోనూ లావాదేవీల‌న్నీ న‌గ‌దు ర‌హితంగా చేసేలా ప్రోత్స‌హిత్సామని, దీనివ‌ల్ల రాష్ట్రం ఆర్థికంగా కుదుట బ‌డుతుంద‌ని చెబుతున్నారు. కానీ వాస్త‌వాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు య‌న‌మ‌ల‌.

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఆంధ్రాకు బాగా న‌ష్టం జ‌రిగింద‌ని రామ‌కృష్ణులు తెలిపారు. ఎఫ్.ఆర్‌.బి.ఎమ్‌. ప‌రిమితిని కేంద్రం నాలుగు శాతం పెంచితే రాష్ట్రానికి బాగుంటుంద‌ని, అప్పుడే ఆంధ్రాకు మేలు జ‌రుగుతుంద‌న్నారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల రాష్ట్ర ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌నీ, న‌వంబ‌ర్‌తో పోల్చితే 7.5 శాతం త‌గ్గిపోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్థిక లోటు ఎక్కువ‌గా ఉంద‌నీ, దీన్ని త‌గ్గించుకోవాలంటే ఖ‌ర్చుల్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆర్థిక మంత్రి లెక్క‌లు ఇలా ఉంటే.. చంద్ర‌బాబు లెక్క‌లు ఇంకోలా ఉంటున్నాయి! రాష్ట్రంలో ఇప్పుడు 34 శాతం లావాదేవీలు న‌గ‌దు ర‌హితంగా జ‌రుగుతున్నాయి చంద్ర‌బాబు అంటున్నారు. మార్చి వ‌చ్చేస‌రికి 70 శాతానికి న‌గ‌దు ర‌హిత లావాదేవీల్ని పెంచుతామ‌ని చెబుతున్నారు! రాష్ట్ర ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోతోంద‌ని య‌న‌మ‌ల ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే.. ఈయ‌నేమో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు పెరుగుతున్నాయని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.