కడప గడపలో టీడీపీ సవాల్

ఏపీలో అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య స‌వాళ్లు విసురుకోవ‌డం కామ‌న్‌గా మారింది. ఏదైనా విష‌యంపై ఇరు ప‌క్షాల నేత‌లూ స‌వాళ్లు రువ్వుకోవ‌డం.. ఆ త‌ర్వాత పోలీసులు రంగంలోకి దిగ‌డం.. ప‌రిస్తితి స‌ర్దుమ‌ణ‌గడం ష‌రా అన్న‌ట్టుగా మారింది. ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక‌టి క‌డ‌పలో చోటు చేసుకుంది. గ‌డిచిన వారం రోజులుగా సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల‌ను ఏక‌బిగిన ప్రారంభించ‌డం లేదా శంకు స్థాప‌న‌లు చేయ‌డంతో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా గండికోట నుంచి పైడిపాళెంకు నీరు పంపింగ్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు.

ఈ ప‌రిణామ‌మే అటు వైకాపా, ఇటు టీడీపీ నేత‌ల మ‌ధ్య అగ్గిరాజేసింది. గండికోట రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌కు త‌మ నేత దివంగ‌త వైఎస్ శంకుస్థాప‌న చేశార‌ని, ఇప్పుడు కేవ‌లం చంద్ర‌బాబు ప్రారంభం మాత్ర‌మే చేస్తున్నార‌ని నిన్న వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఇవే కామెంట్ల‌ను వైకాపా సీనియ‌ర్ నేత గ‌డికోట శ్రీకాంత్ ర‌డ్డి ఉటంకించారు. బాబు చేస్తోంది ఆర్భాటం త‌ప్ప ఏమీలేద‌ని ఆయన వ్యాఖ్యానించ‌డం తీవ్ర వివాద‌మైంది.

నిజానికి అటు రాష్ట్రంలోను, ఇటు క‌డ‌ప‌లోనూ వైఎస్ ఉండ‌గా జ‌రిగిన ప్రాజెక్టుల‌నే ఇప్పుడు చంద్ర‌బాబు త‌న మైలేజీగా మార్చుకుంటున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. అవ‌స‌ర‌మైతే.. వైఎస్ చేసిన కృషి.. చంద్ర‌బాబు చేస్తున్న ఆర్భాటాల‌పై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. శ్రీకాంత్‌రెడ్డి మాట‌లు టీడీపీలో మంట‌పుట్టించాయి.

ఈ విష‌యం ఇంత‌టితో అయిపోతే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ, క‌డ‌ప జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీనివాస‌రెడ్డి.. శ్రీకాంత్‌రెడ్డికి షాకిచ్చారు. స‌వాలును తాము స్వీక‌రిస్తున్నామ‌ని, చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే మీడియాతో సైతం మాట్లాడిన శ్రీనివాస‌రెడ్డి.. ప్లేస్ నిర్ణ‌యించే బాధ్య‌త మీడియా తీసుకుంటే బాగుంటుంద‌ని అన‌డం ఆస‌క్తిక‌రం.

పులివెందుల రైతులు కానీ, ప్ర‌జ‌లు కానీ చంద్ర‌బాబుకు ఏనాడూ ఓటు వేయ‌లేద‌ని, అయినా కూడా బాబు.. ఎంతో ప్రేమ‌తో ఇక్క‌డ ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతున్నార‌ని కొనియాడారు.  వైఎస్‌ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయని జగన్‌, ఆయన పార్టీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  శ్రీకాంత్‌రెడ్డితో చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇప్పుడు క‌డ‌ప‌లో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం హీటెక్కింది. మ‌రి ఈ చ‌ర్చ‌ను శ్రీకాంత్‌రెడ్డి ఎలా స్వీక‌రిస్తారో చూడాలి.