నీళ్ల‌కు కాప‌లా కాస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే

ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇది నిజం! క‌రువు జిల్లాగా పేరొందిన అనంత‌పురానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా నీళ్ల కోసం కాప‌లాకు దిగ‌డం ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారిపోయింది. వాస్త‌వానికి ఈ ఏడాది వ‌ర్షాలు పెద్దగా కుర‌వ‌లేదు. దీంతో సీమ జిల్లాల్లో సాగుకు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. దీంతో చుక్క‌నీటి కోసం అన్న‌దాత అల్లాడిపోతున్నాడు.
 
ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు హంద్రీనీవా ద్వారా మొన్నామ‌ధ్య నీటిని విడుద‌ల చేశారు. అయితే, ఈ నీటిని మ‌ధ్య‌లోనే కొంద‌రు చౌర్యం చేస్తున్నారు. అంటే.. దిగువ ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా త‌మ చెరువులు, పొలాల‌కు మ‌ళ్లించుకుంటున్నారు. దీంతో చివ‌రి ఆయ‌క‌ట్టు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.
 
ఈ విష‌యం త‌న దాకా రావ‌డంతో అనంత జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ‌… వినూత్న రీతిలో ఓ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు నీరివ్వండి మ‌హాప్ర‌భో.. మ‌ధ్య‌లోనే వాట‌ర్ చోరీ జ‌రుగుతోంది అరికట్టండి మ‌హాప్ర‌భో అన్నాకూడా ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగిపోయారు.
 
వివిధ మార్గాల ద్వారా వ‌చ్చిన దాదాపు 20 టీఎమ్‌సీల నీటిని మంత్రి ప‌రిటాల సునీత‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌ ప‌య్యావుల కేశ‌వ్‌లు ముందుగా త‌మ ప్రాంతాల్లో ఉన్న చెరువుల‌ను నింపేసుకున్నార‌ట‌. దీంతో చివ‌రిగా ఉన్న ధ‌ర్మ‌వ‌రం కాలువ వ‌ర‌కు నీరు రావ‌డం లేద‌ని ఎమ్మెల్యే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
ఈ నేప‌థ్యంలో కాలువ‌ద‌గ్గ‌ర నీటి చౌర్యాన్ని అరిక‌ట్టేందుకు, చివ‌రి ఆయ‌క‌ట్టు రైతుల‌కు కూడా న్యాయం జ‌రిగేందుకు ఎమ్మెల్యే న‌డుం బిగించారు. నీటి చౌర్యం లేదా దారి మ‌ళ్లింపు జ‌రుగుతున్నది రాత్రి వేళ‌ల్లోనేన‌ని గుర్తించిన గోనుగుంట్ల‌.. ఇప్పుడు రాత్రి వేళ‌ల్లో కాలువుల‌, చెరువు గ‌ట్ల వెంట కాప‌లా కాస్తున్నారు. త‌న ప‌రిధిలోని రైతుల‌కు భ‌రోసా కూడా క‌ల్పిస్తున్నారు.
 
ఇక‌, ఎమ్మెల్యే అంత‌టి వాడే నైట్ వాచ్‌మెన్‌గా మారితే.. ఆయ‌న వెంట ఉన్న ప‌రివారం మాత్రం ఎలా ప‌డుకుంటారు?  వాళ్లు కూడా కాప‌లాకు దిగిపోయార‌ట‌. మ‌రి ఈ ఎమ్మెల్యేగారి ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.