కేసీఆర్‌కు అస‌లు టెన్ష‌న్ స్టార్ట్‌..!

అవును! తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు అస‌లు టెన్ష‌న్ మొద‌లైంది. న‌వంబ‌రు 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను ర‌ద్దు చేస్తున్న చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత తెలంగాణ‌కు పెద్ద త‌గిలింద‌ని వాపోయారు కేసీఆర్‌. రాష్ట్రానికి నిత్యం రిజిస్ట్రేష‌న్ల రూపంలో రావాల్సిన నిధులు రావ‌డం లేద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇక‌, చిన్నా చిత‌క ప‌రిశ్ర‌మ‌లు కూడా మూత‌ప‌డ్డాయ‌ని, ఫ‌లితంగా కార్మికుల చేతల్లో డ‌బ్బులేద‌ని దీని ప్ర‌భావం ప్ర‌భుత్వంపై క‌నిపిస్తుంద‌ని ఆయ‌న అప్ప‌ట్లో వాపోయారు. అయితే, ఇంత‌లో ఏం జ‌రిగిందో తెలీదుకానీ.. ఉన్న‌ట్టుండి యూట‌ర్న్ తీసుకున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుకు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తిస్తోంద‌ని మీడియా మీటింగ్ పెట్టి మ‌రీ కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాము కూడా న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు మార‌తామ‌ని ప్ర‌క‌టించారు. దీనికిగాను సూచ‌న‌లు, స‌ల‌హాలు చేసేందుకు అధికార క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. నోట్ల ర‌ద్దు జ‌రిగి నెల దాటింది. అయినా ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవ‌డం, ఖ‌జానా కొల్ల‌బోతుండ‌డంతో కేసీఆర్ లోలోనే మ‌థ‌న ప‌డుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఖ‌జానాలో డ‌బ్బు లేక‌పోవ‌డం, ఉద్యోగుల జీత‌భ‌త్యాలు చెల్లించ‌డం, రావాల్సిన నిధులు రాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌పై ఆయ‌న తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఆయ‌న అధికారుల‌కు న‌గ‌దు ఖ‌ర్చుల‌కు సంబంధించి నిర్దిష్ట సూచ‌న‌లు చేస్తున్నార‌ట‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కూ దుబారా ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని మంత్రుల‌కు సైతం కేసీఆర్ సూచించార‌ట‌. ఇక‌, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల విష‌యంలో కూడా ఆచితూచి ఖ‌ర్చులు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతమున్న క‌రెన్సీ ప‌రిస్థితులు ఎప్ప‌టికి సాధార‌ణ స్థితికి వ‌స్తాయో ఎవ్వ‌రికీ స్ప‌ష్ట‌త లేకపోవ‌డంతో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ క్లాస్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో కొత్త‌గా ఎలాంటి ప‌థ‌కాల‌నూ చేప‌ట్ట‌వ‌ద్దని హుకుం జారీ చేశార‌ట‌. మొత్తానికి ఈ నిర్ణ‌యాల‌ను చూస్తుంటే.. కేసీఆర్‌లో టెన్ష‌న్ స్టార్ట‌యింద‌నే తెలుస్తోంది.