ఏపీలో 4 స్థానాల‌పై ఎంఐఎం క‌న్ను

ఉమ్మ‌డి ఏపీలో హైద‌రాబాద్‌లోని పాత బ‌స్తీకే ప‌రిమిత‌మైన ఎంఐఎం(ఆలిండియా మ‌జ్లిస్ ఎ ఇత్తెహిదుల్ ముస్లిమీన్‌) పార్టీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ త‌న జెండా ఎగిరేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు మునిసిపాలిటీల్లో పాగా వేసిన ఎంఐఎం.. త‌ర్వాత మ‌హారాష్ట్ర‌, యూపీల్లోనూ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. ఇప్పుడు ఇదే క్ర‌మంలో ఏపీపైనా ఈ పార్టీ నేత‌లు క‌న్నేశారు. ప‌నిలో ప‌నిగా.. ఏపీలో పాగా వేయ‌డంతోపాటు త‌మ‌పై ముస్లిపార్టీ అన్న ముద్ర‌ను తుడిచేసుకునేందుకు సైతం ఎంఐఎం నేత‌లు కృషి చేస్తున్నారు.

ఏపీలో కర్నూలు – తిరుపతి – శ్రీకాకుళం గ్రేటర్ విశాఖ – కాకినాడ – గుంటూరు – ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్లకు – రాజంపేట – రాజమండ్రి. నెల్లిమర్ల – కందుకూరు మున్సిపాలిటీలకు జ‌న‌వ‌రి – ఫిబ్ర‌వ‌రి మాసాల మ‌ధ్య ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న కర్నూలు – గుంటూరు – గ్రేటర్ విశాఖ – ఒంగోలు మునిసిపాలిటీల‌పై ఎంఐఎం నేత‌లు అస‌దుద్దీన్‌, అక్బ‌రుద్దీన్ క‌న్ను ప‌డింద‌ని హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ టాక్‌. దీంతో ఆయా కార్పొరేష‌న్ల‌లో పాగా వేయ‌డం ద్వారా అంచ‌లంచ‌లుగా పార్టీని విస్త‌రించాల‌ని భాయ్‌లు ఇద్ద‌రూ ప్లాన్ చేశార‌ట‌.

దీంతో ఇప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో పార్టీ పరంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా బస్తీ కమిటీలు వేయడంతోపాటు వివిధ డివిజన్ల – వార్డుల కార్పోరేటర్ – కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మజ్లిస్ నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముస్లిం జనాభా యాభై శాతానికి పైగా ఉన్న చోట్లు ముస్లిం అభ్యర్థులను మెజార్టీ జనాభా ఉండి ఇతర వర్గాల సహాయంతో అక్కడ ఎన్నికల్లో గెలవచ్చన్న పరిస్థితి ఉంటే ముస్లిమేతర అభ్యర్థిని బరిలోకి దించాలని ఎంఐఎం నాయకత్వం సమాలోచనలు చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో స్థానిక సమ‌స్య‌ల‌పైనా స‌మ‌ర భేరీ మోగించాల‌ని ఎంఐఎం నేత‌లు నిర్ణ‌యించారు. సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, అప్పుడే స్థానికంగా ప్రజాదరణ పార్టీకి దక్కుతుందని ఎంఐఎం సమాలోచనలు చేస్తోంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలు ఎలా చేపట్టాలని ఆ పార్టీ అంతర్మథనం చేస్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తడం తప్ప‌ ఇంతవరకు వీధి పోరాటాలు చేసిన సందర్భాలు ఎంఐఎంకు లేవు. దీంతో ఆయా పోరాటాల‌పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నారట‌. ఏం జ‌రుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.