అన్నాడీఎంకేలో మూడు కుంప‌ట్లు

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆసక్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయా?  అధినేత్రి అమ్మ మ‌ర‌ణంతో పార్టీలో అధికారమే కేంద్రంగా విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుందా?  జ‌య‌కు అనుచ‌రులుగా ఉన్న ముగ్గురు వ్య‌క్తులు ప్ర‌ధానంగా పార్టీలో చ‌క్రం తిప్ప‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య మ‌ర‌ణంతో రాష్ట్ర అధికార పార్టీని ఎవ‌రు లీడ్ చేస్తార‌నే ప్ర‌శ్న సాధార‌ణంగా ఉద‌యించేదే. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిగింది.

జ‌య వార‌సులు ఎవ‌రు అని?  అంద‌రిలోనూ ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. సినీ న‌టుడు అజిత్ జ‌యవార‌సుడు అని కొన్ని మీడియా ఛానెళ్లు, ప‌త్రిక‌లు పేర్కొంటున్నా.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం అన్నాడీఎంకేలో ముగ్గురు ప్ర‌ధాన నేత‌లు మాత్రం క‌నిపిస్తున్నారు. వీరిలో ప్ర‌స్తుతం సీఎం ప‌గ్గాలు చేప‌ట్టిన ఓ ప‌న్నీర్ సెల్వం, జ‌య‌కు అత్యంత ఆప్తురాలు శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌, జ‌య‌కు స‌ల‌హాదారు మాజీ అధికారి షీలా బాల‌కిష‌న్‌. వీరు ముగ్గురి పేర్లు పైకి వినిపిస్తున్నాయి. సీఎం ప‌గ్గాలు ప‌న్నీర్ చేప‌ట్టినా.. పాల‌న విష‌యం స‌హా పార్టీ విష‌యంలోనూ శ‌శిక‌ళ‌, షీలాలు కూడా వేలు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

వాస్త‌వానికి జ‌య త‌ద‌నంత‌రం సీఎం పీఠాన్ని ఎవ‌రు అధిరోహించాల‌నే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌లో ఏకాభిప్రాయం రాలేద‌ని స‌మాచారం. కొంద‌రు ప‌న్నీరైతే ఫ‌ర్వాలేద‌ని అన్నార‌ని, ఇక, షీలా అయితే బాగుంటుంద‌ని, శ‌శిక‌ళ అయితే, బెస్ట్ అని అన్న‌ట్టు తెలిసింది. అయితే, ఇప్పుడున్న సిట్యుయేష‌న్‌లో అమ్మ‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ప‌న్నీర్‌కే ఆ బాధ్య‌తలు అప్ప‌గిస్తే బాగుంటుంద‌ని డిసైడ్ అయిన శ‌శిక‌ళ .. త‌న వ్యూహం ప్ర‌కార‌మే సెల్వాన్ని సీఎం అయ్యేలా చేశార‌ని తెలుస్తోంది.

ఇక‌, షీలా విష‌యానికి వ‌చ్చేస‌రికి సీనియ‌ర్ బ్యూరోక్రాట్ అయిన ఆమె.. కూడా సీఎం పీఠం రేసులో ముందంజ‌లోనే ఉన్నా.. ఎందుకైనా మంచిది అనుకుంటూ దాని నుంచి త‌ప్పుకొన్నారు. దీంతో ప‌న్నీర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే, ఈయ‌న‌కు పాల‌న అంత న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో శ‌శిక‌ళ‌, షీలాలు పెద్ద ఎత్తున కుంప‌ట్లు రాజేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకేలో మూడు కుంప‌ట్లు ఖాయ‌మ‌ని అంటున్నారు. పొలిటిక‌ల్ విశ్లేష‌కులు! ఇక‌, ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.