బాల‌య్య శాత‌క‌ర్ణి వెన‌క పొలిటిక‌ల్ స్కెచ్‌

చారిత్ర‌క క‌థాంశం నేప‌థ్యంలో సంచ‌ల‌న డైరెక్ట‌ర్ క్రిష్, నంద‌మూరి బాల‌య్య‌ల కాంబినేష‌న్‌లో గ్రాండ్‌గా తెర‌కెక్కిన మూవీ శాత‌క‌ర్ణి. ఈ మూవీని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ నెల 16న శాత‌క‌ర్ణి ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌ను మ‌రింత గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని రెడీ అయ్యారు. దీనికి వేదిక‌గా తిరుప‌తిని కూడా ఖ‌రారు చేశారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా ఈ సినిమా పండుగ పొలిటిక‌ల్ పండుగ‌ను త‌ల‌పించేలా మారిపోతోంద‌ని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

శాత‌క‌ర్ణి ఆడియో ఫంక్ష‌న్‌కి మూవీ ఇండ‌స్ట్రీ నుంచి హేమీహేమీల‌నే కాకుండా పొలిటిక‌ల్‌గా కూడా దీనికి మ‌రింత క‌ల‌రింగ్ ఇవ్వాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యారు. వాస్త‌వానికి ఆయ‌న ఇప్ప‌టికే హిందూపురం ఎమ్మెల్యే. ఏపీ సీఎం ఎలాగూ సొంత బావే. దీంతో ఈ వేదిక‌ను పొలిటిక‌ల్ గ్రౌండ్‌గా మార్చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక‌, బాబు తో పాటు కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు కూడా ఈ వేడుక‌ల‌కు వ‌స్తున్న‌ట్టు తెలిసింది. వీరంతా క‌లిస్తే.. మూవీ మాట‌ల క‌న్నా పొలిటిక‌ల్ పంచ్‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

నిజానికి మూవీ ఫంక్ష‌న్ల‌కి పొలిటిక‌ల్ లీడ‌ర్స్ రావ‌డం సాధార‌ణ‌మే. అయితే, శాత‌క‌ర్ణి విష‌యంలో మాత్రం రివ‌ర్స్ అవుతోంద‌ని స‌మాచారం. మొత్తంగా ఈ కార్య‌క్ర‌మం అంతా ఏపీ అధికార పార్టీ టీడీపీ సొంత కార్య‌క్ర‌మం మాదిరిగా జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. భారీ ఎత్తున బాల‌య్య‌, చంద్ర‌బాబు, వెంక‌య్య‌ల క‌టౌట్లు తిరుప‌తి న‌గ‌రాన్ని ముంచెత్త‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ఏంటంటే.. శాత‌క‌ర్ణి ఫంక్ష‌న్‌ని టీడీపీ నేత‌లే ద‌గ్గ‌రుండి మ‌రీ ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. మ‌రి ఎలా ఉంటుందో చూడాలంటే 16 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.