మోడీ మ‌రో చావు దెబ్బ‌…బ‌డా బాబులు మ‌టాష్‌

దేశంలోని న‌ల్ల కుబేరుల‌ను ప్ర‌ధాని మోడీ ఇప్ప‌ట్లో వ‌దిలి పెట్టేరా లేరా? ఇప్ప‌టికే వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన మోడీ.. మ‌రింత‌గా ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారా? మ‌రింత క‌ఠిన చ‌ట్టాలు తేనున్నారా?  రాబోయే రోజుల్లో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది కేంద్రం నుంచి! తాజాగా పెద్ద నోట్ల ర‌ద్దు. బ్యాంకు విత్‌డ్రాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న మోడీ.. ఇంకా లైన్‌లోకి రాని న‌ల్లకుబేరుల‌పై మ‌రింత‌గా రెచ్చిపోవాల‌ని డిసైడ్ అయింది.

ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే దేశంలో బంగారం వినియోగంపైనా మోడీ అస్త్రం ప్ర‌యోగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీ వ‌ద్ద ఉన్న బంగారం ఎంతో?  చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను లెక్క‌లు కోరేందుకు ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. అదేవిధంగా బంగారం కొనుగోలుపైనా ఆంక్ష‌లు విధించ‌నున్నారు. ఇక‌, బ్యాంకులో నిర్ణీత మొత్తం 2.5 ల‌క్ష‌ల‌కు మించి ఉన్న న‌గ‌దు విష‌యంలో లెక్క‌లు చెప్ప‌ని ప‌క్షంలో 50% న‌గ‌దును ప‌న్ను రూపంలో చెల్లించేలా కూడా చ‌ట్టం ప‌దును పెంచ‌నున్నారు. ఇక‌, మిగిలిన 50% మొత్తాన్ని క‌నీసం 4 సంవ‌త్స‌రాలు సీజ్ చేసేలా కూడా పెద్ద ఎత్తున నిర్ణ‌యాలు వెలువ‌డ‌నున్నాయి.

ఇదంతా డిసెంబ‌ర్ 30లోపు స్వ‌యంగా న‌ల్ల‌ధ‌నాన్ని ధృవీక‌రించిన వారి ప‌రిస్థితి. ఒక వేళ డిసెంబ‌ర్ 30 తర్వాత బ్లాక్‌మ‌నీ ప‌ట్టుబ‌డితే 90 శాతం ప‌న్నుతో పాటు జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. దీనికి సంబంధించి పార్ల‌మెంట్‌లో ఐటీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును కేంద్రం ప్ర‌వేశ పెట్ట‌నుంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది ప్ర‌స్తుతం మ‌న బ్యాంక్ ఖాతాల మీద కూడా  వ‌ర్తిస్తాయ‌ట‌.

అయితే, కేంద్ర నిర్ణ‌యాలు ఎంత పాజిటివ్‌గా ఉన్నాయ‌ని భావిస్తున్నా.. సామాన్యులు, చిన్న‌త‌ర హా ప‌రిశ్ర‌మ‌ల వ్యాపారులు, కేంద్ర ఉద్యోగులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి పంటి కింద‌రాళ్ల‌లా ప‌రిణ‌మిస్తున్నాయ‌నే టాక్ వ‌స్తోంది. ఈ చ‌ర్య‌లు విష‌మిస్తే.. మోడీ ప్ర‌భుత్వానికి మొద‌టికే మోసం వ‌చ్చే ఛాన్స్ ఉంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే 2019లో మోడీ.. ప్ర‌జాగ్ర‌హాన్ని చ‌విచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.