ఏపీ మండ‌లిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు

ఏపీ శాస‌న మండ‌లిలో దాదాపు 23 మంది స‌భ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరంతా 2017 ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి త‌మ ప‌ద‌వీ కాలాల‌ను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్ప‌టి నుంచే ముమ్మ‌రంగా ఉంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌దానికి మించి ఒక‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాల‌ని భావిస్తుండ‌గా.. వైకాపా క‌నీసం స‌గం సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ కోటాలో మండలి చైర్మన్ చక్రపాణి. రెడ్డ‌ప్ప‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇక‌, ఎమ్మెల్యే కోటాలో మండలి వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ప్రతిభా భారతి, మండలి ప్రతిపక్ష నేత(కాంగ్రెస్‌) సి.రామచంద్రయ్య, మహ్మద్ జానీ(కాంగ్రెస్‌), చంగల్ రాయుడు, సుధాకరబాబు ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటాలో మెట్టు గోవిందరెడ్డి, సి.నారాయణరెడ్డి, బొడ్డు భాస్కరరావు, అంగర రామ్మోహన్ రావు, మేకా శేషుబాబు, విశ్వప్రసాద్, వాకాటి నారాయణ రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంద‌రి పదవీ కాలం 2017 మార్చిలో ముగియనుంది.

గ్రాడ్యుయేట్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు, టీచర్స్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తోంది. ఈ స్థానాల‌కు టీడీపీ ఇప్ప‌టికే రెడ్డి సామాజిక వ‌ర్గాన‌కి చెందిన వారిని ఎంపిక చేసి ప్ర‌క‌టించింది కూడా. ఇలా మొత్తంగా రానున్న మూడు మాసాల్లో.. 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎమ్మెల్సీలు ద‌క్కించుకునేందుకు టీడీపీ, వైకాపాలో ఆశావ‌హుల సంఖ్య పెరిగిపోయింది.

సతీష్ రెడ్డితో పాటు..కాంగ్రెస్ నుంచి టీడీపీ సైకిలెక్కిన వాకాటి నారాయణ రెడ్డి, సుధాకరబాబు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి వీరు ఆ హామీతోనే సైకిల్ ఎక్కార‌ని స‌మాచారం. సో.. వీరికి ఈ స్థానాలు పోయినా.. టీడీపీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలకి పోటీ ఉండ‌నుంది.

జూపూడి ప్ర‌భాక‌ర‌రావు, ప్ర‌తిభా భార‌తి, మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజు, శోభా హైమావతి, మల్లెల లింగారెడ్డి, కరణం బలరాం, ఎన్ ఎమ్ డి ఫ‌రూక్, సాయిబాబా, చందుసాంబ‌శివ‌రావు  వంటి వారు ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో పోరు ర‌స‌కందాయంగా మారే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏపీలో 23 కొత్త ఎమ్మెల్సీలు ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్నారు!