మోడీని స‌పోర్ట్ చేసిన నాగ‌బాబు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం స‌ర్వ‌త్రా క‌ల‌క‌లం సృష్టించింది. న‌ల్ల‌ధ‌నంపై పోరు కోసం ప్ర‌జ‌లు ఈ బాధ‌లు ప‌డాల్సిందేన‌ని తొలి రెండు రోజులు ప్ర‌ధాని మోడీ చెప్ప‌డంతో ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో దేశ ప్ర‌జ‌లంతా త‌మ‌కేదో మంచి జ‌రుగుతుంద‌ని భావించారు. తొలి రెండు రోజులు కాదు వారం రోజులు ఎదురు చూశారు. కానీ, నేటికీ ప‌రిస్థితిలో మార్పు రాలేదు. చిల్ల‌ర లేక అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. పెళ్లిళ్లు క‌నాక‌ష్టంగా చేసుకుంటున్నారు. వైద్యం స‌రిగా అంద‌డం లేదు. ఆప‌రేష‌న్లు నిలిచిపోయాయి. దీంతో ఈ ర‌ద్దు నిర్ణయంపై ఇప్పుడు సెగ‌లు పుడుతున్నాయి

ఈ క్ర‌మంలోనే స్పందించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. న‌ల్ల నోట్ల ర‌ద్దుపై త‌న‌దైన స్టైల్‌లో కామెంట్లు చేశాడు. అయితే ఎక్క‌డా మోడీని ఆయ‌న విమ‌ర్శించ‌లేదు. ర‌ద్దు మంచిదే.. కానీ, దీని త‌ర్వాత వ‌చ్చే ప‌రిణామాల‌ను త‌ట్టుకునే ప‌రిస్థితిపై ప్ర‌భుత్వం అంచ‌నా వేయ‌లేక‌పోయింద‌ని ప‌వ‌న్ అన్నారు. ప్ర‌జ‌లంతా నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని, తాను సైతం బ్యాంకుకు వెళ్లి నాలుగు వేలు మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు. ఇలాంటి తిప్ప‌లు పెట్ట‌డం మంచి ది కాద‌ని అన్నారు. ఉన్న కొద్ది మంది న‌ల్ల కుబేరుల కోసం ఇన్ని కోట్ల మందిని ఇబ్బందులు పెట్ట‌డంతో భ‌విష్య‌త్తులో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌న్నారు.

అయితే, ఇప్పుడు ప‌వ‌న్ కామెంట్ల‌కు కౌంట‌రా అన్న‌ట్టు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వెరైటీగా స్పందించారు. మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ నిర్ణ‌యానికి తాను పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు చెప్పారు. తాను స్వ‌త‌హాగా త‌న అన్న ఉన్న కాంగ్రెస్ పార్టీకి విధేయుడిన‌ని చెప్పుకొన్న నాగ‌బాబు.. మోడీని మాత్రం ఓ రేంజ్‌లో పొగిడేశాడు.

ప్రజలు ఆ మాత్రం కష్టాలు పడలేరా? హుధ్ హుధ్ తుఫాన్ వచ్చినప్పుడు కష్టాలు పడ్డారుగా, చెన్నైకి వరదలు వచ్చినప్పుడు కష్టాలు పడ్డారుగా, అలాగే ఇందిరాగాంధీగారు ఎమర్జెన్సీని తీసుకొచ్చినప్పుడు కూడా నానా కష్టాలూ పడ్డారుగా అంటూ సగటు మోడీ భక్తుడిలా మాట్లాడేశారు.  ఈ కామెంట్ల‌తో మెగా అభిమానుల మైండ్ మ‌రో సారి బ్లాంక్ అయింది. త‌మ్ముడు అలా.. అన్న ఇలా.. అంటూ చ‌ర్చించుకున్నారు. మొత్తానికి తాను బీజేపీ కాదంటూనే మోడీని బీజేపీ నేత‌లు సైతం పొగ‌డ‌ని విధంగా పొగిడేశాడు నాగ‌బాబు.