మాజీ సీఎం కొడుకు సినిమా అప్పుల కుప్ప‌లు

మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవ‌గౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ డెబ్యూ మూవీ జాగ్వార్ విడుదలకు ముందు ఎక్కడ చూసినా ఆ సినిమా ముచ్చట్లే. కుమ‌ర‌స్వామి అయితే మాజీ సీఎం కావ‌డంతో త‌న కొడుకును టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ప్ర‌మోట్ చేసుకునేందుకు తెలుగులో సైతం భారీగానే ఈవెంట్లు నిర్వ‌హించి, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

జాగ్వార్ ఆడియో కూడా తెలుగులో అతిర‌ధ మ‌హార‌థుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. అందుకోసం హైద‌రాబాద్‌లోనే ఆయ‌న ప్ర‌త్యేకంగా కొన్ని రోజులు మ‌కాం వేశారు. నిఖిల్ అయితే తెలుగులో టాప్ టీవీ ఛానెళ్ల చుట్టూ తిరిగారు.

జాగ్వార్ తెలుగు వెర్షన్ బాధ్యతలు అన్నీ, సినిమా నిర్మాత వైజాగ్ రాజు చూసుకున్నారు.

ద‌స‌రా కానుక‌గా నాలుగు సినిమాల పోటీలో జాగ్వార్ రిలీజ్ అయ్యింది. తెలుగులో యావ‌రేజ్‌గా ఆడింది. సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. సినిమా ప్ర‌మోష‌న్ల‌కు తెలుగు మీడియాను బాగా వాడుకున్నారు. అయితే ఇప్పుడు మీడియా వాళ్ల‌ను, నాన్ రిఫండ‌బుల్ ప‌ద్ధ‌తిలో సినిమాను కొన్న బ‌య్య‌ర్ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

జాగ్వార్ ప్ర‌మోష‌న్ల కోసం తెలుగు మీడియాను వాడుకున్నందుకు గాను ఇక్క‌డ మీడియాకు చెల్లించాల్సిన బిల్లులు మూడు వంతులు అలాగే పెండింగ్ లో వుండిపోయాయని వినికిడి. బిల్లులు రావాల్సిన వారంతా వైజాగ్ రాజు నో, కుమారస్వామినో వస్తారని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తారని చూస్తున్నారు. ఇక నిఖిల్ రెండో సినిమా సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో స్టార్ట్ కానుంది. మ‌రి ఈ అప్పులు ఎవ‌రు తీరుస్తారో ? ఎప్పుడు తీరుస్తారో చూడాలి.