బాబు కేబినెట్‌లో సెటిల్‌మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో జ‌గ‌న్‌ను తిట్టే శాఖా మంత్రి, దూకుడు మంత్రి, సెటిల్మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్ రానుంద‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త ఆరేడు నెల‌లుగా త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌క్షాళ‌న‌లో త‌న కుమారుడు లోకేష్‌కు సైతం కేబినెట్ బెర్త్ ద‌క్కుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను తొల‌గించి వారి స్థానంలో సీనియ‌ర్ల‌కు, కొత్త‌వారికి కూడా ఛాన్స్ ఉంటుంద‌న్న టాక్ ఉండ‌నే ఉంది.

ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఓ మంత్రికి ప్ర‌మోష‌న్ ఇస్తార‌న్న ప్ర‌చారం ఇప్పుడు టీడీపీ ఇన్న‌ర్ పాలిటిక్స్‌లో జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నిజంగానే ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. అచ్చెన్న తాను ప్రాథినిత్యం వ‌హిస్తోన్న కార్మిక శాఖ‌లో ఇప్ప‌టికే ప‌లు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు అందుకున్నారు.

కార్మిక సోద‌రుల‌కు చంద్ర‌న్న బీమా పేరిట ఏపీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన కొత్త ప‌థ‌కంపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రెడిటంతా చంద్ర‌బాబుదే అయినా…ఈ కీల‌క నిర్ణ‌యం వెన‌క అచ్చెన్నాయుడుకు సైతం ఎక్కువ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇక శాఖా ప‌రంగా ఉత్త‌మ ప‌నితీరు క‌న‌ప‌రుస్తోన్న అచ్చెన్న క‌ర్నూలు జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. అచ్చెన్న ఓ ప‌ని ప్రారంభించారంటే అది పూర్త‌య్యేదాకా నిద్ర‌పోరు.

ఈ క్ర‌మంలోనే అచ్చెన్న ప‌ట్టుద‌ల గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఓ ప‌ని అప్ప‌గించ‌డంతో ఆ ప‌ని స‌క్సెస్‌గా పూర్తి చేశార‌ట‌. క‌ర్నూలు జిల్లా టీడీపీలో వ‌ర్గ విబేధాలు తీవ్ర‌స్థాయిలో ఉన్నాయి. వీటిని చంద్ర‌బాబు ఎన్నిసార్లు ప‌రిష్క‌రించినా ఆ విబేధాలు అస్స‌లు త‌గ్గ‌లేదు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ శిల్పామోహ‌న్‌రెడ్డి మ‌ధ్య విబేధాల‌ను చంద్ర‌బాబు ఎన్నోసార్లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ కాలేక‌పోయారు.

ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు… అచ్చెన్న‌కు అప్ప‌గించారు. బాబు ఆదేశాల‌తో రంగంలోకి దిగిన అచ్చెన్న భూమా – శిల్పా బ్ర‌ద‌ర్స్ – మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌తో భేటీ అయ్యి ఒకేపార్టీలో ఉంటూ నిత్యం విమ‌ర్శ‌లు చేసుకుంటుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రం న‌ష్ట‌పోతామ‌న్న విష‌యాన్ని వివ‌రించారు. పార్టీ అధికారంలో ఉంటే అంద‌రికి మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని కూడా అచ్చెన్న వారికి వివ‌రించ‌డంతో భూమా – శిల్ప బ్ర‌ద‌ర్స్ ఇక‌పై క‌లిసి ప‌నిచేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వీరితో భేటీ అయ్యాక అచ్చెన్న బ‌య‌ట‌కు వ‌చ్చి ఇక‌పై భూమా, శిల్పా వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేస్తాయ‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఏపీని, బాబు ప్ర‌భుత్వాన్ని ఒక కుదుపు కుదిపిన కాపు ఉద్య‌మం స‌మ‌యంలో కూడా నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, బొడ్డు భాస్క‌ర రామారావు, తోట త్రిమూర్తులు లాంటి వారు మ‌ద్ర‌గ‌డ‌తో నిరాహార దీక్ష‌ను విర‌మింప‌జేయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయారు. అప్పుడు కూడా అచ్చెన్న ఎంట్రీ ఇచ్చి ముద్ర‌గ‌డ‌ను ఒప్పించారు. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకున్న బాబు అచ్చెన్న‌కు పార్టీలోని మ‌రిన్ని వివాదాల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో పాటు కేబినెట్ ప్రక్షాళ‌న‌లో కీల‌క‌మైన హోం శాఖ లేదా మ‌రో ప్రాముఖ్యం ఉన్న శాఖ ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.