చంద్ర‌బాబు అందుకే రాజ‌కీయ మేథావి అయ్యాడు

కింద ప‌డ్డా పైచేయి నాదే అనే టైపు పొలిటీషియ‌న్ల‌కు ఈ దేశంలో కొద‌వ‌లేదు! ముఖ్యంగా ఏపీలో అయితే.. ఇంకో రెండాకులు చ‌దివిన సీఎం చంద్ర‌బాబు లాంటి నేత‌ల‌కు అస్స‌లు కొద‌వ‌లేదు!! ప్ల‌స్ అయితే త‌న ఖాతాలోను, మైన‌స్ అయితే ప‌క్క‌వాడి(విప‌క్షం) ఖాతాలోను వేయ‌డం బాబుకు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీద‌ని అంటారు పొలిటిక‌ల్ పండితులు. 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి వైఎస్ ధాటికి టీడీపీ మ‌ట్టి క‌రిచింది. ఇది నిజం! ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ వ‌చ్చిన వెంట‌నే సైడైపోయిన చంద్ర‌బాబు అండ్‌కో.. తెల్లారి పెట్టిన ప్రెస్ మీట‌లో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

వైఎస్‌కి ఓటింగ్‌ శాతం త‌గ్గింద‌ని, ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని అన్నారు. త‌మ‌కు రాష్ట్రంలోని అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ స‌ర‌ళి, శాతం పెరిగింద‌ని కేవ‌లం .5% ఓట్లు మాత్ర‌మే తేడా వ‌చ్చాయ‌ని వివ‌రించారు. అంతేకానీ.. తాము ఓడిపోయామ‌ని, ప్ర‌జ‌లు మ‌రోసారి వైఎస్‌ను ఎన్నుకున్నార‌ని ఆయ‌న ఒప్పుకోలేక‌పోయారు. ఆయ‌న‌తో అంట‌కాగే, ది లార్జెస్ట్ స‌ర్క్యులేటెడ్ డైలీ కూడా ఇదే సోదితో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించింది. వాస్త‌వానికి  ఎన్నిక‌ల్లో గెలిచిందే వైఎస్‌. నిజానికి ఆయ‌న‌పై అసంతృప్తి ఉంటే ఓడిపోయి ఉండాలి క‌దా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు బాబు ద‌గ్గ‌ర గానీ, ఆయ‌న‌కు స‌పోర్ట్ చేసే ప‌త్రిక‌ల ద‌గ్గ‌ర‌కానీ స‌మాధానం ఉండ‌దు.

అంటే కింద‌ప‌డ్డా పైచేయి టైప‌న్న‌మాట‌! ఇక‌, ఈ పంథాను బాబు ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేదు! ఇది దేశ వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిన విష‌యం! అయితే, ఇక్క‌డ ప్ర‌శ్నేంటంటే.. హోదా రాలేదా? ఏపీ ప్ర‌భుత్వం తెచ్చుకోలేదా? అంటే.. నిజానికి రెండోదే క‌రెక్ట్‌. చంద్ర‌బాబు ఎప్పుడూ కేంద్రంతో హోదా కోసం ఒత్తిడి చేసింది లేదు! త‌న పార్టీకి చెందిన ఇద్ద‌రు మంత్రులు కేంద్రంలో ఉండి కూడా ఆయ‌న ఏమీ చేయ‌లేక‌పోయారు. అయినా.. కూడా ఆ అప‌వాదు త‌న‌పైకి రాకుండా.. కేంద్రం ఇవ్వ‌లేద‌నే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. అంటే ఈ మైన‌స్‌ను కేంద్రం ఖాతాలో వేసేశారు.

ఇక‌, మ‌రింత తాజాగా నోట్ల రద్దు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాని మోడీ ఈ ప్ర‌క‌టన చేసిన వెంట‌నే మీడియా తో మాట్లాడిన‌(అదే రోజు రాత్రి) బాబు.. ఈ అవిడియా త‌న‌దేన‌ని, తానే రూ.1000 నోటు ర‌ద్దు చేయ‌మ‌న్నాన‌ని చెప్పుకొన్నారు. నోట్ల ర‌ద్దుతో న‌ల్ల ధ‌నం వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌జ‌ల్లో సింప‌తి ఏర్ప‌డితే అది త‌న ఖాతాలోనూ కొద్దిగా ప‌డేసుకోవాల‌ని బాబు ప్లాన్‌! అంతా బాగానే ఉంది! ఇప్పుడు స్టోరీ రివ‌ర్స్!! నోట్ల ర‌ద్దుతో ఏపీ జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. దీంతో బాబు కూడా యూట‌ర్న్‌!! ర‌ద్దు విష‌యాన్ని ప‌క్క‌కు నెట్టేసి.. రాష్ట్రానికి చిల్ల‌ర పంపించాల‌ని డిమాండ్‌(విజ్ఞ‌ప్తి చేసినా ఆర్‌బీఐ ఎంతివ్వాలో అంతే ఇస్తుంది) చేస్తూ.. ఆర్‌బీఐకి, కేంద్రానికి లేఖ రాశారు.

 దీనిని మీడియాకూ చూపించారు. ఇక‌, ఇంత‌లో ఆర్‌బీఐ నుంచి రెండు వేల కోట్ల పైచిలుకు చిల్లర రాష్ట్రానికి వ‌స్తోంది. దీంతో ఈ క్రెడిట్‌ని బాబు త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నారు. ఆ  డ‌బ్బును తాను రాసిన లేఖ ఆధారంగానే ఆర్‌బీఐ పంపుతోంద‌నే బిల్డ‌ప్ చేస్తున్నారు. దీనికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌త్రిక‌లు మ‌రింత క‌ల‌రింగ్ ఇచ్చిఢంకా బ‌జాయిస్తున్నాయి. నిజానికి దేశంలోని జ‌నాభా ఆధారంగా, ద్ర‌వ్య నిల్వ‌లు, ఖ‌ర్చు వంటి వాటిని ఆధారంగా చేసుకుని ఆర్‌బీఐ ఇప్పుడు చిల్ల‌ర పంపుతోంది. అంతేకానీ, లేఖ‌రు రాశార‌ని, డిమాండ్ చేశార‌ని పంప‌దు. కానీ, బాబు గారి ప్ర‌చారం మాత్రం అదిరిపోతోంది. దీంతో చంద్ర‌బాబు అందుకే రాజ‌కీయ మేథావి అయ్యాడు అని రోజాలాంటి వాళ్లు స‌టైర్ల‌తో కుమ్మేయ‌కుండా ఉంటారా చెప్పండి?!!