ఆ సీఎంను కాపీ కొడుతున్న కేసీఆర్‌

ఐడియాల‌ను కాపీ కొట్ట‌డం ఇటీవ‌ల కాలంలో ఎక్కువగా అల‌వాటైపోయింది. ముఖ్యంగా సీఎంల స్థాయిలోనే ఇది జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన క‌రెన్సీ స్ట్రైక్ త‌ర్వాత‌.. దేశంలో విప్ల‌వాత్మ‌క‌మైన ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మోడీని నిత్యం తిట్టిపోసే .. బిహార్ సీఎం నితీష్ కుమార్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(మొద‌ట్లో మెచ్చుకున్నారు) కూడా మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మొద‌ట పొగిడిన కేజ్రీ  ఆ త‌ర్వాత త‌న‌లోని పొలిటిక‌ల్ ఫిగ‌ర్‌ని బ‌య‌ట‌కు తీసి విమ‌ర్శ‌లు, స‌వాళ్ల వ‌ర‌కు వెళ్లారు.

ఇక‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఇదే బాట‌లో మోడీని ఘ‌నంగా పొగ‌డ‌డ‌మే కాకుండా అస‌లా ఐడియా ఇచ్చింది తానేన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇది ముదిరి త‌న మెడ‌కే చుట్టుకుంటున్న త‌రుణంగా బాబు త‌న యాంగిల్ మార్చేశారు.. అది వేరే స్టోరీ! ఇక‌, తెలంగాణ సీఎం మొద‌ట్లో.. మోడీ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీనివ‌ల్ల తెలంగాణ‌కు ఆదాయం భారీ స్థాయిలో ప‌డిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రిజిస్ట్రేష‌న్లు ఆగిపోతున్నాయ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నులు నిలిచిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఒక్క‌సారిగా త‌న ప్లేటు ఫిరాయించారు. ఢిల్లీకి వెళ్లి న‌రేంద్ర మోడీని క‌లిసి వ‌చ్చాక ఏం జ‌రిగిందో ఏమో.. కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్నారు. మోడీకి జైకొట్టి.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి జేజేలు ప‌లికారు. దీంతో అంద‌రూ అవాక‌య్యారు. ఈయ‌నేమ‌న్నా బిహార్ సీఎం నితీష్‌ని కాపీకొడుతున్నారా అని చ‌ర్చించుకున్నారు. దీనికీ ఓ రీజ‌న్ ఉంది. మొద‌ట్లో మోడీని తీవ్రంగా తిట్టిపోసిన నితీష్‌.. ఇప్పుడు హార‌తి ప‌డుతున్నారు. అంతేకాదు, నోట్ల ర‌ద్దు ప‌రిణామాల‌పై అధ్య‌య‌నానికి వేసిన సీఎంల క‌మిటీలో త‌న‌నూ చేర్చ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకుని పొగ‌డ్త‌ల జల్లు కురిపించ‌డ‌మే నితీష్‌ని కాపీ కొడుతున్నార‌నే విష‌యాన్ని స‌పోర్ట్ చేస్తోంది. ఏదేమైనా.. అధికారంలో ఉన్న వారు ఏం చేసినా.. బాగానే ఉంటుంది.