స‌ర్వేలు ఫ‌స్ట్ అంటోన్నా కేసీఆర్‌లో టెన్ష‌న్ ఎందుకు..!

దేశంలోని ముఖ్య‌మంత్రుల జాబితాలో కేసీఆర్ ఫ‌స్ట్ వ‌చ్చార‌ని తాజా స‌ర్వేలు చెబుతున్నాయి. మిగిలిన ముఖ్య‌మంత్రులు అంద‌రిక‌న్నా కూడా ప్ర‌జాద‌ర‌ణ‌లో ఆయ‌న ఫ‌స్ట్ ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది వీడీఎఫ్ స‌ర్వే. ఈ స‌ర్వే ఫ‌లితాల త‌ర్వాత అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు. ఎందుకంటే.. సాధార‌ణంగా అంత‌గా ప్ర‌జ‌ల్లో ఉండ‌ని కేసీఆర్‌కి ఫ‌స్ట్ క్లాస్ ఎలా సాధ్య‌మైందా అని చ‌ర్చించుకున్నారు. అయితే, ఈ స‌ర్వేల సంగ‌తి అలా ఉంచితే.. కేసీఆర్‌లో మాత్రం ఒకింత ఆందోళ‌న క‌నిపిస్తున్న‌ట్టే తెలుస్తోంది! ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు ఆద‌ర‌ణ ఉన్నప్ప‌టికీ ఆయ‌న టీంపై మాత్రం స‌ద‌భిప్రాయం అంత‌గా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

రాజ‌కీయంగా అంద‌రూ బాగానే ఉంద‌ని చెబుతున్నా.. పాల‌న ప‌రంగా మంత్రులు, అధికారులు ఒకింత అవినీతికి తెర‌తీశార‌నే తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఈ స‌ర్వేల‌తో అంత‌గా సంతృప్తి చెంద‌డంలేదు. కానీ, ఆయ‌న మంత్రి వ‌ర్గం స‌హా టీఆర్ ఎస్ వ‌ర్గం మొత్తం పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. స‌ర్వేల్లో చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం చూసుకుంటే.. కేసీఆర్ చాలా స్థిమితంగా ఉండాలి. కానీ.. ఎక్క‌డా ఆ ప‌రిస్థ‌తి క‌నిపించ‌డం లేదు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద వైద్య శాల‌ల‌కు బ‌కాయిలు పేరుకుపోయాయ‌నే ఆందోళ‌న కొన‌సాగుతుండ‌గా, విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కం పెద్ద ఎత్తున చికాకులు సృష్టిస్తోంది.

మ‌రోప‌క్క‌, గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం కేసు విచార‌ణ నెల‌ల త‌ర‌బ‌డి సాగుతూనే ఉంది. వాస్త‌వానికి న‌యీం హ‌త‌మైన కొన్ని వారాల్లోనే నిందితుల‌ను బోనెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత చ‌ప్ప‌బ‌డి పోయారు. దీనిపై ఇంకా విచార‌ణ సాగుతూనే ఉంది. అదేవిధంగా మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్‌లో కురిసిన అకాల వ‌ర్షాల‌తో న‌గ‌రం మునిగిపోయింది. దీంతో మీడియా ముందుకు వ‌చ్చిన సీఎం అక్ర‌మ క‌ట్ట‌డాల ప‌నిప‌డ‌తామ‌న్నారు. అది కూడా గాలికి కొట్టుకుపోయింది. ఇక‌, జీహెచ్ ఎంసీ అధికారుల అవినీతిపై పెద్ద ఎత్తున మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వీటిపైనా చ‌ర్చ‌లు గాలికి కొట్టుకుపోయాయి.

అయితే, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు, మ‌హారాష్ట్ర‌తో ఒప్పందాలు, మిష‌న్ భ‌గీర‌థ వంటివి కేసీఆర్‌కు క‌లిసివ‌స్తున్నాయా? అంటే అవి అంతంత‌మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మంత్రులు, అధికారుల‌పై చ‌ర్చ‌ల‌కు కేసీఆర్ సిద్ధం కాక‌పోవ‌డం, విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్‌, టీడీపీ నేత‌ల‌పై ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డాల‌ని త‌న కేడ‌ర్‌కి ఆదేశాలు ఇవ్వ‌డం వంటివి చూస్తుంటే ప‌రిస్థితి ఏదో తేడాగానే ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, డిసెంబ‌రు 2న త‌ల‌పెట్టిన స‌భ 2019 ఎన్నిక‌ల‌కు స‌న్నాహ‌కంగానే భావించాల్సి ఉంటుంది. ఈలోగానే కేసీఆర్ త‌న టీంను మారుస్తార‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. కేసీఆర్‌పై స‌ర్వేలు చెబుతున్న వాతావ‌ర‌ణం అంత‌ర్గ‌తంగా ఏమీలేద‌ని తెలుస్తోంది.