ప‌వ‌న్ టీజ‌ర్లు ముఖ్య‌మా..? పునాది ముఖ్య‌మా ..?

2014 ఎన్నిక‌ల‌కు కొద్దిగా ముందు ఘ‌నంగా జ‌నంలోకి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌.. అతి త‌క్కువ కాలంలోనే జ‌నంలోకి దూసుకుపోతుంద‌ని, రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల స‌ర‌స‌న చేరిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, దీనికి భిన్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ స్థాపించి రెండు న్న‌రేళ్లు దాటిపోయినా.. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నా.. పార్టీ క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డం, క్షేత్ర‌స్థాయిలోకి పార్టీని తీసుకువెళ్ల‌డం, పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఏర్పాటు చేయ‌డం వంటి అంశాల‌పై ఇప్ప‌టి వ‌రకు దృష్టి పెట్ట‌లేదు. ప్ర‌శ్నిస్తానంటూ జ‌నంలోకి వ‌చ్చిన ప‌వ‌న్‌కు ఇప్పుడు అదే జ‌నం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు ఎదురవుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

సాధార‌ణంగా ఏదైనా పార్టీని స్థాపించ‌డ‌మే కాకుండా దానికి ప్ర‌జ‌ల్లో భారీ ఎత్తున మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం, కార్య‌క‌ర్త‌ల సైన్యాన్ని సిద్ధం చేసుకోవ‌డం వంటివి ఉంటాయి. ఈ విష‌యంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు.. అప్ప‌టి ప‌రిస్థితిలో పార్టీని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు ఎంత శ్ర‌మించాలో అంత‌కు మించి శ్ర‌మించారు. నిత్యం జ‌నంలోనే మ‌మేక‌మ‌య్యారు. ఇది మ‌న పార్టీ అనేలా వారి మ‌ధ్య చ‌ర్చ పెట్టారు. అందుకే అన‌తి కాలంలోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, ఆ త‌ర్వాత కాంగ్రెస్ ను ఎదిరించి వైకాపాను స్థాపించిన జ‌గ‌న్ కూడా త‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డం కోసం నిరంతరం ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. త‌న త‌ల్లి, చెల్లిని సైతం పాలిటిక్స్‌లోకి తీసుకువ‌చ్చారు.

మ‌రి, ఇలాంటి వాటికి భిన్నంగా ప‌వ‌న్ కేవ‌లం టీజ‌ర్లు, ట్విట్ట‌ర్లు, ఫేస్‌బుక్‌లు అంటూ కాలక్షేపం చేయ‌డంపైనే కార్య‌క‌ర్త‌లు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నందున పార్టీని బ‌లోపేతం చేయ‌డం, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను కూడ‌గ‌ట్ట‌డం, ఓటు బ్యాంకు సాధించ‌డం వంటివి ప్ర‌ధాన ల‌క్ష్యాలు. కానీ, పవ‌న్ ఈ దిశ‌గా ఒక్క అడుగూ ముందుకు వేయ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా నిరాశ వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక ప‌క్క సినిమాలు, మ‌రోప‌క్క రాజ‌కీయం అంటున్నా.. అంత‌గా వ‌ర్క‌వుట్ కాద‌ని, ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉండే నేత‌ల‌ను మాత్ర‌మే ఇష్ట‌ప‌డ‌తార‌ని, ముఖ్యంగా గ్రామీణుల్లో ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి ట్విట్ట‌ర్‌లో ఓ ట్వీట్ చేస్తేనో.. ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో షేర్ చేస్తేనో . ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అవుతామ‌ని అనుకోవ‌డం స‌రికాదంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం ఏపీకి శాపంగా భావిస్తున్న ప్ర‌త్యేక హోదాను ఉద్య‌మ రూపంలో తీసుకుని, దీనికి త‌న స్టాండ్ ఏమిటో ప్ర‌క‌టించి, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్టుకుని, మండ‌లాలు, పంచాయితీలు, న‌గ‌రాలు, కార్పొరేష‌న్ల నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆదిశ‌గా ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల్సి ఉంది. లేక‌పోతే, ఒక టీజ‌రు, రెండు ట్వీట్ల‌ను న‌మ్ముకుంటే అనుకున్న‌ది సాధించ‌డం అంత వీజీ కాద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఎలా డిసైడ్ అవుతారో చూడాలి.