తెలంగాణ మంత్రుల‌కు ఏమైంది..?

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కుటుంబ రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయ‌న్న‌విప‌క్షాల మాట‌లు కాసేపు ప‌క్క‌న‌బెడితే..  అస‌లు కేసీఆర్ కు దీటుగా నిలిచి నెగ్గుకు రాగ‌ల నేత మ‌రొక‌రు టీఆర్ఎస్‌లో మాత్ర‌మే కాదు.. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కు మ‌రే పార్టీలోను క‌నిపించ‌డం లేద‌న్న‌ది నిష్టుర నిజం. దీంతో ఆ పార్టీ హ‌వాకు అక్క‌డ ఎదురే లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు కాకుండా  మిగిలిన మంత్రులంతా డ‌మ్మీలు అయిపోయారంటూ విప‌క్షాలు చేస్తున్నవిమ‌ర్శ‌ల అంశాన్ని జ‌నం కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌నే చెప్పాలి. అయితే నిజంగానే కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్న ఇత‌ర మంత్రులెవ‌రూ క‌నీసం వారి శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనూ నోరు మెద‌ప‌కపోవ‌డం చూసేవారికి కాస్త విచిత్రంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ ప్ర‌జ‌ల్లో కూడా వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న కొంద‌రు  రాజ‌కీయ చైత‌న్య‌వంతులు మాత్రం.. అస‌లు..తెలంగాణ కేబినెట్‌లో  హ‌రీశ్ రావు ఒక్క‌డే మంత్రా?  మిగిలిన వారెవ‌రూ కాదా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతు రుణ‌మాఫీ, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ద‌ళితుల‌కు భూ పంపిణీ, త‌దిత‌ర విష‌యాల్లో ప్ర‌తిప‌క్షాలు కొంత‌కాలంగా మూకుమ్మ‌డిగా దాడి చేస్తోంటే..  తెలంగాణ మంత్రులంతా మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం చూస్తే ఎవ‌రికైనా ఇలాగే అనిపిస్తుంది మ‌రి. ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్ర‌తిపక్షాల ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం మంత్రుల‌ను ప్ర‌శ్నించడంతో పాటు వారిపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు చేప‌డుతున్నా.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌ను ఎందుకు దీటుగా తిప్పికొట్ట‌డంలేద‌ని కేసీఆర్ నిల‌దీశార‌ట‌.  మ‌రి ఈ మంత్రుల‌కు మాట ప‌డిపోవ‌డం వెనుక కార‌ణ‌మేంటన్న‌ది పెద్ద ప‌జిల్‌గానే క‌నిపిస్తోంది.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌పున త‌న వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. ఒక్క హ‌రీశ్ రావు మాత్ర‌మే అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి.  ఓ ప‌క్క  త‌మ ఉనికిని కాపాడుకునేందుకు, తిరిగి పున‌ర్వైభ‌వం సాధించేందుకు ప్ర‌తిప‌క్షాలు, జేఏసీలు క‌లిసి ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దీక్ష‌లు, ఆందోళ‌న‌లు చేప‌డుతున్నాయి.  రుణ‌మాఫీ, నిజాంషుగర్స్ ఫ్యాక్ట‌రీ మూసివేత వంటి కీల‌క విష‌యాల్లో సైతం మంత్రి పోచారం పూర్తి స్థాయిలో ఇప్ప‌టిదాకా స్పందించ‌లేక‌పోయారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, విద్యార్థుల ఫీజు బ‌కాయిల విడుద‌ల విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రినుంచి ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన స‌మాధానం రాలేదు. ఇక రెవెన్యూ, ఆదాయం, అప్పుల విష‌యంలోనూ మిగిలిన‌మంత్రులెవ‌రూ ఒక్క‌సారి కూడా ప్రెస్‌మీట్ పెట్ట‌లేదు. అంటే పైకి చెప్పేది వేరేలా ఉన్నాసీఎం కేసీఆర్ స్వ‌యంగా వీరికి హ‌ద్దులు నిర్ణ‌యించారా అన్న అభిప్రాయ‌లూ వినిపిస్తున్నాయి.