జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌గా మారిన బావ – బావ‌మ‌రుదులు

రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప క‌ర్నూలుతోపాటు ఆ స్థాయిలో వైసీపీకి బ‌ల‌మైన జిల్లాలుగా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌ను చెప్పుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల కొద్దికాలంగా ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ గ్రాఫ్ అంత‌కంత‌కూ దిగజారుతోంది. దీనికి అధికార పార్టీ అనుస‌రిస్తున్న‌గొప్ప‌రాజ‌కీయ వ్యూహాలు కార‌ణ‌మ‌ని ఎవ‌రైనా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే..  అవును మరి… స్థానికంగా ఉన్న ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఆధిపత్య పోరే  ఇక్క‌డ వైసీపీకి శాపంగా మారింది. ఇంతా చేసి మ‌నం చెప్పుకునే వ్య‌క్తులు రాజకీయ ప్రత్యర్థులు కాదు.. వారికి వ్యక్తిగత గొడవలు కూడా లేవు… ఇంకా విచిత్ర‌మేమిటంటే  ఆ నేత‌లు ఇద్ద‌రు పార్టీ అధినేతకు ద‌గ్గ‌ర బంధువులు కూడా.. వారుండే ఇళ్లు కూడా ప‌క్క ప‌క్క‌నే.. అయినా వీరిద్ద‌రూ ఒకరినొకరు పలకరించుకోరు. ఒకరి కార్యక్రమానికి మరొకరు హాజరుకారు.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రంటే… ఒక‌రు   మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాగా మ‌రొక‌రు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. ప్ర‌స్తుతం జిల్లాలో వీరిద్ద‌రి మధ్య ఆధిపత్య పోరాటం అంత‌కంత‌కూ శ్రుతి మించుతోంది.. అధినేత దగ్గర తమ మాటే నెగ్గాలన్న పంతం పట్టి పట్టుదలకు పోతున్నారు. ఎత్తులు పైఎత్తులు వేసేందుకూ వెనుకాడ‌టం లేదు! ఈ ఆధిపత్యపోరుతో వీరికి రాజ‌కీయ లాభం మాటేమోగాని, ఇక్క‌డ పార్టీ పునాదులు మాత్రం కదిలిపోతున్నాయి.. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన అనుభవం బాలినేనిది కాగా… ఇక వైవీ సుబ్బారెడ్డి స్వ‌యంగా… వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి తోడల్లుడు. వైఎస్‌ ఫ్యామిలీతో పాటే ఉంటూ.. జగన్‌ పార్టీ పెట్టగానే అందులో చేరారు సుబ్బారెడ్డి.  ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బాలినేని ..జగన్‌ కోసమంటూ ఆ పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో మళ్లీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బాలినేని , ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేశారు.. బాలినేనికి పరాజయం ఎదురవ్వగా… సుబ్బారెడ్డి మాత్రం ఎంపీగా గెల‌వ‌గ‌లిగారు.. ఈ గెలుపోటములు ఆ ఇద్ద‌రు నేత‌ల మధ్య అంతరాన్ని పెంచాయి.. క్రమక్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.. ఓటమి భారంతో బాలినేని కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. ఇదే సమయంలో సుబ్బారెడ్డి అన్నీ తానై పార్టీని నడిపించారు.

తదనంతర పరిణామాల నేపథ్యంలో… జిల్లాలోని మెజారిటీ నాయకుల కోరిక ప్ర‌కారం.. వైసీపీ అధినేత జ‌గ‌న్..  జిల్లా పార్టీ పగ్గాలను బాలినేనికి అప్పగించారు. ఇక అక్క‌డినుంచి ఇరువురు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఓ స్థాయిలో మొద‌లైంది. ప్ర‌స్తుతం ఈ నేత‌ల వైఖ‌రి జిల్లాలో వైసీపీ శ్రేణుల‌కు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆ పార్టీ నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తోంది.. ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే.. అధినేతకు ఆంత‌రంగికులుగా ఉన్న వారేమో అధిపత్యం చెలాయిస్తూ పార్టీకి నష్టం తెస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆ పార్టీ శ్రేణులనుంచి విస్తృతంగా వినిపిస్తున్నాయి.

పార్టీకి సంబంధించిన ప్రధాన పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టడం… పార్టీ పదవుల్లో కొందరు ఎమ్మెల్యేల సిఫారసుకు కూడా విలువ లేకపోవడం వంటి అంశాల‌తో.. క్యాడ‌ర్లో అసంతృప్తి రగులుకుంటోంది. ఇంత జ‌రుగుతున్నా ఈ జిల్లా నేత‌ల వ్య‌వ‌హారాన్ని పార్టీ అధినేత ప‌ట్టించుకోక‌పోవ‌డంపై పార్టీ శ్రేణులు విస్మ‌యం వ్య‌క్తం  చేస్తున్నాయి. ఒక‌ప‌క్క అధికార పార్టీ ఆక‌ర్ష్ మంత్రాన్ని జ‌పిస్తున్న నేప‌థ్యంలో పార్టీ నేత‌ల తీరు ఇలాగే ఉంటే ఇక్క‌డ వైసీపీకి గ‌డ్డు రోజులు రావ‌డం ఖాయ‌మేన‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.