కొత్త సీఎం కోసం ట్ర‌యాంగిల్ ఫైట్‌

త‌మిళ‌నాడుకు కొత్త సీఎం రానున్నారా? జ‌య ఆరోగ్య ప‌రిస్థితి నేప‌థ్యంలో సీఎం పీఠంపై మ‌రొక‌రు కూర్చోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందా? ఈ క్ర‌మంలో స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దాదాపు 20 రోజుల‌కు పైగా సీఎం జ‌య ల‌లిత అనారోగ్యంతో ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో రాష్ట్ర పాల‌న‌ను ఆమె గౌర‌వ స‌ల‌హాదారు రిటైర్డ్ ఐఏఎస్ బాల కిష‌న్ చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పూర్తిస్థాయిలో పాల‌న జ‌ర‌గ‌డం లేదు. మ‌రో ప‌క్క‌జ‌య మ‌రో నెల వ‌ర‌కు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సి ఉంటుంద‌ని వైద్యులు తేల్చిచెప్ప‌డంతో సీఎం పీఠంపై మ‌రొక‌రు కూర్చోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే దృష్టిసారించిన త‌మిళ‌నాడు ఇన్‌చార్జ్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు.. రాష్ట్ర‌లో జ‌రుగుతున్న పాల‌న వ్య‌వ‌హారాల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి నివేదిక తెప్పించుకున్నారు. అదేస‌మ‌యంలో తాత్కాలిక సీఎంను నియ‌మించ‌డంపైనా చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో జ‌య కేబినెట్‌లో కీలకంగా ఉన్న ఆర్థిక మంత్రి ప‌న్నీరు సెల్వం, ర‌హ‌దారులు, పోర్టుల మంత్రి ప‌ళ‌నిస్వామిల‌తో గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించారు. జ‌య ఆస్ప‌త్రి నుంచి వ‌చ్చే వ‌ర‌కు తాత్కాలిక సీఎంను ఏర్పాటు చేసే అంశంపై వీరితో చ‌ర్చించారు. దీంతో త‌మిళ‌నాడు కొత్త సీఎం వీరిలో ఒక‌రు అవుతార‌నే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే, మిగిలిన కేబినెట్ స‌హ‌చ‌రుల‌తో చ‌ర్చించాకే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇక‌, ప‌న్నీరు సెల్వం, ప‌ళ‌నిస్వామిలు జ‌య‌కు అత్యంత స‌న్నిహిత మంత్రులే అయినా.. సీఎం ప‌ద‌వి మాత్రం ప‌న్నీర్ సెల్వంనే వ‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే, ప‌ళ‌ని స్వామి వ‌ర్గం మాత్రం త‌మ నేత సీఎం కావాల‌ని కోరుతున్నారు. గ‌తం చ‌రిత్ర‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. జ‌యకు ఏదైనాఆప‌ద సంభంవిచిన‌ప్పుడు ఆమె సీట్లో ప‌న్నీర్ సెల్వ‌మే కూర్చునేవారు. గ‌తంలో సీఎంగా ఉన్న స‌మ‌యంలో జ‌య అక్ర‌మాస్తుల కేసులో ఇరుకున్న‌ప్పుడు ప‌న్నీరే సీఎం అయ్యారు. అయినా కూడా ఆయ‌న ఎక్క‌డా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు.

అమ్మ చెప్పిన మాట ప్ర‌కారం పాల‌న సాగించారు. అంతేకాదు, సీఎంగా ఉన్నా కూడా ఏ ఒక్క‌రోజు జ‌య ఆఫీస్‌లోప‌లికి కూడా అడుగు పెట్ట‌లేదు. అంత‌టి విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. దీంతో ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామిల‌ను పోల్చిన‌ప్పుడు సెల్వానికే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా అజిత్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు సీఎం అవుతార‌ని, అమ్మ తిరిగి వ‌చ్చి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టేవ‌ర‌కు తాత్కాలిక సీఎంగా ఉంటార‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే, సెల్వం పేరే బ‌లంగా వినిపిస్తోంది. ఏదేమైన ఒక‌టి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.